ప్రభుత్వ అనుమతులు లేని రిప్పాల్స్ ప్రైవేట్ పాఠశాలపై సీజ్ చర్యలు

by Taduka Kalyani |

ప్రభుత్వ అనుమతులు లేని రిప్పాల్స్ ప్రైవేట్ పాఠశాలపై సీజ్ చర్యలు
X

దిశ, బిచ్కుంద, (నిజాంసాగర్) : ప్రభుత్వ చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రిప్పాల్స్ లెర్నింగ్ క్యాంపస్ ప్రైవేట్ పాఠశాలను త్వరలో సీజ్ చేయనున్నట్లు బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ హయ్యం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల నిర్వహణకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు మున్సిపాలిటీ నుంచి యాజమాన్యం పొందలేదని స్పష్టం చేశారు. అనుమతులకు సంబంధించి పాఠశాల యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి, వివరణ సమర్పించేందుకు గడువు ఇచ్చినప్పటికీ, ఆ గడువు ముగిసిందన్నారు. పాఠశాల పై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే పాఠశాలను సీజ్ చేసే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కంధారపల్లి గ్రామంలో ఉన్న రిప్పాల్స్ లెర్నింగ్ క్యాంపస్ పాఠశాలలో చేర్పించకుండా జాగ్రత్త వహించాలని కమిషనర్ సూచించారు. ఇటీవల పాఠశాలపై వరుసగా వస్తున్న ఆరోపణలు, అనుమతుల విషయంలో తలెత్తిన వివాదాలు పాఠశాల నిర్వహణను సందిగ్ధంలోకి నెట్టాయి. ఇప్పటి వరకు పాఠశాలకు అన్ని అనుమతులు ఉన్నాయని తల్లిదండ్రులను నమ్మబలికిన యాజమాన్యానికి, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వరుసగా నోటీసులు అందడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. పాఠశాలపై రోజురోజుకు కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో పలువురు విద్యార్థులు ఇతర విద్యాసంస్థలకు మారుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాఠశాల వ్యవహారాలపై సంబంధిత అధికారులను సంప్రదించి వివరణ కోరగా, తప్పుడు లీజ్ పత్రాలు, లేఅవుట్ అనుమతుల లేమి, నిర్మాణ అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యం పలు నిబంధనలను పాటించకుండా కాలం గడుపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు పంపినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని అనుమతులు కలిగిన విద్యాసంస్థల్లోనే తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులకు సూచించారు.

Next Story