ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు పెంచాలి

by Taduka Kalyani |

జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు.

ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు పెంచాలి
X

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో మార్చి-2026 త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టి. సుధీర్ కుమార్ సమావేశాన్ని సమన్వయం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బ్యాంకింగ్ కార్యకలాపాలపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్ సమగ్ర నివేదికను సమర్పించారు. జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.3,499.21 కోట్లకు గాను 90.66 శాతం, మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.6,816.57 కోట్లకు గాను 87.16 శాతం, మొత్తం అడ్వాన్సుల లక్ష్యం రూ.23,438.93 కోట్లకు గాను 92.81 శాతం సాధించినట్లు తెలిపారు. విద్యా రుణాలు, గృహ రుణాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు.ఈసందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వెన్న మాట్లాడుతూ బ్యాంకులకు కేటాయించిన గ్రామాల్లో ప్రధానమంత్రి జనధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని సూచించారు. రీ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, ఖాతాలను సక్రియంగా నిర్వహించుకోవడం గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక, మత్స్యరంగ రుణాల కింద అర్హులైన రైతులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశానికి ఆర్బీఐ, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, డీఆర్‌డీఏ, డీఐసీ అధికారులు, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు, ప్రతినిధులు హాజరయ్యారు.

Next Story