ముస్తాబైన ‘మేడారం’

by velandi.Saikiran |   (  Updated:2026-01-17 21:16:22  IST  )

ముస్తాబైన ‘మేడారం’
X

దిశ, వరంగల్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ జాతర కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులన్నీ పూర్తయ్యాయి. వనదేవతల సన్నిధిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టారు. రూ. 101 కోట్లతో అమ్మవార్లగద్దెల పనులను పూర్తి చేశారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఒకే వరుసలో అభివృద్ధి చేశారు. ఏపీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రానైట్ (కృష్ణశిలలు) రాళ్లతో గద్దెల చుట్టూ ప్రాకారాలను, రాతి కట్టడాలను నిర్మించారు. వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. కోయ వంశీయులకు సంబంధించిన వేల ఏళ్ల చరిత్రను శిల్పులతో చిత్రాలను ఆ రాళ్లపైన చిత్రీకరించారు. అక్టోబర్ లో మొదలు పెట్టిన ఈ పనులు కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. మరో రూ. 150 కోట్లతో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ, జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలు, తాగునీటి వసతులను కల్పించారు. ములుగు నుంచి మేడారం వరకు రోడ్ల వెంట పచ్చదనం (ల్యాండ్ స్కేపింగ్), డివైడర్ల అలంకరణ, ఆదివాసీ చరిత్రను తెలిపే విగ్రహాలు, వాల్ పోస్టర్లతో మేడారం కొత్త కళను సంతరించుకున్నది.

రేపు ప్రారంభోత్సవం

మేడారంలో పూర్తయిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆదివారం రాత్రి మేడారంలోనే బసచేయనున్న సీఎం ఉదయం మంత్రులతో కలిసి గద్దెల వద్దకుచేరుకుంటారు. గద్దెల పునర్ నిర్మాణ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడజరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.

నేడు కేబినెట్ భేటీ

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఆదివారం సాయంత్రం మేడారంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశం కానుంది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం రాష్ట్రంలోనే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో ఓ సారి కేబినెట్ భేటీ ఉట్నూర్ లో జరగ్గా.. మళ్లీ ఇప్పుడు మేడారంలో జరగడం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ సమావేశంలో జాతర నిర్వహణ, నిధులు, గిరిజనసంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ సహా 300 మంది అధికారులకు హరిత హోటల్, టెంట్ సిటీ, తాడ్వాయి, రామప్ప తదితర ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేశారు.

ఫుల్ సెక్యూరిటీ..

సీఎం బస చేస్తుండడం, మేడారం ఛత్తీస్ గఢ్ సరిహద్దున ఉండడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ములుగు ఎస్పీ రామ్ నాథ్ కేకన్ పర్యవేక్షణలో 1500 మంది సివిల్ పోలీసులను బందోబస్తు కోసం మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలతో విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు,డ్రోన్ల ద్వారా అణువణువూ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సెలవు కావడం, సీఎం పర్యటన ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Next Story