మామిడి దోపిడీ...? లబోదిబోమంటున్న రైతులు

by velandi.Saikiran |

జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ గోదాం ఆధ్వర్యంలో జరుగుతున్న మామిడి కొనుగోళ్లు వివాదాస్పదంగా మారాయి.

మామిడి దోపిడీ...? లబోదిబోమంటున్న రైతులు
X

మామిడి.. దోపిడీ!

=టన్నుకు క్వింటా కోత

=300 రూపాయలు లేబర్ చార్జి

=మెయింటెనెన్స పేరిట అదనపు వడ్డన

=లబోదిబోమంటున్న రైతులు..

=లక్షల్లో నష్టం..? కోట్ల వ్యాపారం..

=అధికారుల మౌనం ఎందుకు..?

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ గోదాం ఆధ్వర్యంలో జరుగుతున్న మామిడి కొనుగోళ్లు వివాదాస్పదంగా మారాయి. టన్నుకు 100 కిలోల వరకు కోత విధించడంతో పాటు, లేబర్ చార్జీలు, “మెయింటెనెన్స్” పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్, ఖమ్మం వంటి దూర మార్కెట్లకు వెళ్లే పరిస్థితి లేక స్థానికంగానే అమ్మకాలు జరుపుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈదురుగాలులు, అకాల వర్షాలతో మామిడి ధరలు పడిపోగా, తూకాల్లో కోతలు, అదనపు కట్‌లతో మరింత నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

టన్నుకు క్వింటా కోత..

టన్నుకు ఏకంగా 100 కేజీల వరకు కోత వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టన్ను మామిడి ధర సగటున రూ.30 వేలుగా లెక్కిస్తే,100 కేజీల విలువ సుమారు రూ.3వేల వరకు వస్తుందని చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా వివిధ వాహనాల్లో తీసుకొచ్చిన మామిడి కాయల్ని దిగుమతి చేసేందుకు ఒక టన్నుకు 300 రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేకాక “మెయింటెనెన్స్” పేరిట ప్రతి రూ.100కు అదనంగా రూ.10 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సరైన రసీదులు ఇవ్వకపోవడం, మార్కెట్ ఫీజుల వసూళ్లలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై కూడా రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రోజుకు 50 టన్నుల కొనుగోళ్లు..!

ఈ మార్కెట్లో రోజుకు సుమారు 50 టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరుగుతున్నాయని గోదాం నిర్వాహకులు చెబుతున్న నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో దాదాపు 1,500 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. టన్నుకు 100 కేజీల చొప్పున కోత వేస్తున్నట్లయితే, మొత్తం 1,500 టన్నులకు సుమారు 1,50,000 కేజీల వరకు అదనపు కోత పడినట్టవుతుంది. టన్ను ధర సగటున రూ.30 వేలుగా లెక్కిస్తే ఈ 1,50,000 కేజీల విలువ సుమారు రూ.45 లక్షలకు పైగానే ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు.“ఈ డబ్బంతా ఎటు పోతోంది..?” అన్న ప్రశ్న ఇప్పుడు రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అధికారుల మౌనం ఎందుకు..?

ప్రస్తుత ధరల ప్రకారం 1,500 టన్నుల మామిడి కొనుగోళ్ల విలువ సుమారు రూ.4.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంత భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యవేక్షణ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేట్ గోదాంలలో నిర్వహిస్తున్న వేలం పాటలు అధికారిక అనుమతులతోనే జరుగుతున్నాయా..? మార్కెట్ ఫీజులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయా..? తూకాల్లో అక్రమాలపై ఎప్పుడైనా తనిఖీలు జరిగాయా..? రైతుల నుంచి వసూలు చేస్తున్న అదనపు కట్‌లకు చట్టబద్ధత ఉందా..? ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పవలసి ఉంది.

విజిలెన్స్ అధికారులు దృష్టి సారించేనా.?

ఈ దోపిడీ వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని ఎన్ని రోజులుగా కొనుగోలు జరుగుతున్నాయి?ఇప్పటివరకు ఎన్ని టన్నులు కొనుగోలు జరిగాయి?మార్కెట్ ఫీజు ఏమేరా చెల్లించారు. టన్నుకు 100 కేజీల తరుగు,300 లేబర్ చార్జి, మెయింటెనెన్స్ భారం వ్యవహారాల పై నిజా నిజాలు నీగ్గు తేల్చాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ ను వివరణ కోరగా కొనుగోలు జరిగిన దానిమీద మార్కెట్ ఫీజ్ 1 శాతం చెల్లించవలసి ఉంటుందని టన్నుకు క్వింటా తరుగు ఇతరతర వ్యవహారాలు తన దృష్టికి రాలేదని ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ చేపిస్తానంటూ చెప్పుకొచ్చారు. వరంగల్ లాంటి మార్కెట్లలో గ్రేడింగ్ చేసి క్వింటా వరకు తరుగు తీస్తారు. కానీ మనం గ్రేడింగ్ వెయ్యకుండా చెత్తాచెదారంఎలా ఉన్నా క్వింటా తరుగు తీస్తున్నామని దిగుమతి చార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు ప్రతి మార్కెట్లో జరిగే వ్యవహారమేనని మార్కెట్ నిర్వాహకుడు తెలిపారు.

Next Story