మొక్కజొన్నకు దిక్కేది..? నష్టపోతున్న అన్నదాతలు

by velandi.Saikiran |

మొక్కజొన్న కొనుగోలు కోసం ఇప్పటి వరకు మార్క్ ఫెడ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం మద్దతు రావడంలేదు.

మొక్కజొన్నకు దిక్కేది..? నష్టపోతున్న అన్నదాతలు
X

మక్క రైతుకు మద్దతు ఏది..?

= మార్కెట్‌లలో మద్దతు ధరకు కొనేందుకు

ముందుకు రాని వ్యాపారులు

= నష్టపోతున్న అన్నదాతలు

= మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి

కొనుగోలు చేయాలని డిమాండ్

దిశ, వరంగల్ బ్యూరో : మొక్కజొన్న కొనుగోలు కోసం ఇప్పటి వరకు మార్క్ ఫెడ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం మద్దతు రావడంలేదు. వ్యాపారులు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయడం లేదు. ధర రాకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆరుతడి పంటలు సాగుచేస్తే లాభం వస్తుందని భావించి మొక్కజొన్న సాగుచేసిన రైతుకు మాత్రం ఫలితం లేదు. మార్క్ ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటివరకు మాత్రం కొనుగోళ్లను మొదలు పెట్టలేదు. వ్యాపారులు సిండికేట్ గా మారడంతో అన్నదాతలకు ధర రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ మార్క్ ఫెడ్ కొనుగోలు ప్రారంభించలేదు. నామమాత్రం కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కొనుగోలు చేపట్టలేదు. మక్క పండించిన రైతులు మాత్రం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ధర రాక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

3లక్షల ఎకరాలకు పైగా సాగు..

ఉమ్మడి జిల్లా పరిధిలో యాసంగిలో సుమారు 3లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో రైతులు ఈ పంటను వేశారు. గడిచిన 15 రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలోని మార్కెట్‌లకు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. మార్కెట్ లో మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ కు తెచ్చిన మక్కలను క్వింటాలు 1600 నుంచి 1800ల వరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. మద్దతు ధర క్వింటాలు 2400 ఉన్న వ్యాపారులు మాత్రం ఆ ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మక్కల సీజన్ ఆరంభమైన కొనుగోలు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.

అన్ని మార్కెట్ లతో పాటు ఇతర కేంద్రాల్లో మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నామమాత్రంగా నర్సంపేటలో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంకా కొనుగోళ్లను మొదలు పెట్టలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు పండించిన ఈ మొక్కజొన్నలను అన్ని మార్కెట్ లతో పాటు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలు మద్దతు ధర 2400లకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో ఈ కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మార్కుపేడ్ జిల్లా మేనేజర్ రంజిత్ రెడ్డి తెలిపారు.

Next Story