- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్యానికి దూరంగా ఇందిరమ్మ ఇళ్లు!
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇప్పటికీ మంజూరైన ఇళ్లలో సగం కూడా పూర్తి కాలేదు.

లక్ష్యానికి దూరంగా ఇందిరమ్మ ఇళ్లు!
=ఉమ్మడి జిల్లాలో స్లోగా ఇంటి నిర్మాణాలు
=మొదటి విడతలో 42500 ఇళ్లకు 3వేల నిర్మాణాలే పూర్తి..
=మిగతా ఇళ్లపై ఫోకస్ పెట్టిన అధికారులు
= రెండో విడత కోసం ఎదురు చూస్తున్న పేదలు
దిశ, వరంగల్ బ్యూరో: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇప్పటికీ మంజూరైన ఇళ్లలో సగం కూడా పూర్తి కాలేదు. మొదట లబ్ధిదారులను ఎంపిక చేసినా నిధుల సమస్యలతో ఆగిపోయాయి. అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీల్లో మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించడంతో ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయి. మెటీరియల్ ధరలు పెరగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంజూరైన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు రెండో విడత మంజూరు చేసే ఇళ్లపైన అధికారులు దృష్టి పెట్టారు. గ్రామ సభలు, వార్డు సభల్లో వీటిని పరిశీలించడంతో పాటు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు.
ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు..
ప్రభుత్వం మొదటి విడత కింద ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసింది. ఆ ఇళ్లకు అనుగుణంగా నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి ఇళ్లను మంజూరు చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు 500 వరకు ఇళ్లను పెంచారు. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి విడత కింద 42,500 ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 31,570 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. వీటిలో 3వేల ఇళ్ల వరకు పూర్తికావడంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాల్లో సుమారు 10,500 ఇళ్ల వరకు ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో సర్వేలు నిర్వహించడంతో పాటు ఇళ్లు ఏ లెవల్ లో నిలిచిపోయాయో గుర్తించడంతో పాటు వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులతో మాట్లాడటంతో పాటు మహిళా సంఘాల సభ్యులైతే వారికి రుణాలు లక్ష రూపాయలు ఇప్పించి మొదలు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు కూడా మొదటి విడత ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వెంటాడుతున్న సమస్యలు..
ఉమ్మడి జిల్లా పరిధిలో మొదటి విడత కింద మంజూరైన వివిధ కారణాలతో లబ్ధిదారులు నిర్మాణం చేపట్టలేదు. ఇసుక, సిమెంట్, ఐరన్ తో పాటు ఇతర ధరలు పెరగడం రూ.5లక్షల్లో ఇంటి నిర్మాణం అయ్యే పరిస్థితి లేకపోవడం, నిబంధనల ప్రకారం 460 అడుగుల నుంచి 600 అడుగుల లోపే నిర్మాణం చేయాల్సి ఉండటంతో ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా మండలాల పరిధిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడటంతో పాటు అవగాహన కల్పించడంతో ఈ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలకు తోడు మరింత భారం పడుతుండటంతో కొంత మంది లబ్ధిదారులు వెనుకడుగు వేశారు. వివిధ కారణాలతో ఆగిన ఇళ్ల పైన ఫోకస్ పెట్టిన అధికారులు టార్గెట్ ప్రకారం పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రెండవ వితపై అధికారుల ఫోకస్..
మొదటి విడత లబ్ధిదారుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో అధికారులు రెండవ విడతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయనుండటంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఆయా గ్రామాల పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలతో పాటు పేదలు ఇళ్ల కోసం పోటీ పడుతున్నారు. నిత్యం అధికారులు, ఎమ్మెల్యేలను కలుస్తూ దరఖాస్తులు చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొంత మందికి ఇళ్ల స్థలాలు లేకపోవడం వల్ల ఇళ్లు మంజూరైన ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించి రెండవ విడత కింద ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రతీ నియోజకవర్గం పరిధిలో మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు మొదలు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిబంధనల మేరకు బిల్లులను మంజూరు చేస్తున్నామని వారు తెలిపారు.






