ఎరుపెక్కిన ఏనుమాముల..ఇతర దేశాలకు ఎగుమతి!

by velandi.Saikiran |   (  Updated:2026-03-11 22:45:55  IST  )

వరంగల్ మార్కెట్ కు మిర్చి పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా భారీగా మిర్చిని రైతులు మార్కెట్ కు తీసుకవచ్చి విక్రయాలు చేస్తున్నారు.

ఎరుపెక్కిన ఏనుమాముల..ఇతర దేశాలకు ఎగుమతి!
X

ఎరుపెక్కిన ఏనుమాముల

=వరంగల్ మార్కెట్ కు పోటెత్తిన మిర్చి

=ప్రతిరోజూ 30వేల నుంచి 50వేల బస్తాల వరకు రాక

=ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివస్తున్న రైతులు

=మార్కెట్ లో జోరుగా క్రయవిక్రయాలు

= ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ మార్కెట్ కు మిర్చి పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా భారీగా మిర్చిని రైతులు మార్కెట్ కు తీసుకవచ్చి విక్రయాలు చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గిస్తున్నా రైతులు ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేస్తున్నారు. ప్రతిరోజూ 30వేల నుంచి 50వేల బస్తాల వరకు సరుకు వస్తోంది. కొనుగోలు చేస్తున్న మిర్చిని వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

గడిచిన వారంరోజులుగా పోటెత్తిన మిర్చి..

వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు గడిచిన వారం రోజులుగా భారీగా మిర్చి వస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ కు తరలివస్తున్నారు. తేజా, వండర్ హాట్, దేశీ, ఎల్లో మిర్చీ, సింగిల్ పట్టీ, దీపికతో పాటు ఇతర రకాలను అమ్ముతున్నారు. ఈయేడు మిర్చికి డిమాండ్ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. వరంగల్ మార్కెట్ లో రెండు నెలలుగా కొనుగోలు జరుగుతున్నా వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర రావడం లేదు. ముందే నిర్ణయించిన ప్రకారం వ్యాపారులు ఒకటి లేదా రెండు లాట్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మిగతా సరకు మోడల్ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. డిమాండ్ ఉన్నా ధర పెట్టకపోవడంతో క్వింటాలు కు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు నష్టం జరుగుతుంది.

మార్కెట్​లో ధరలు ఇలా..

వరంగల్ మార్కెట్ లో తేజా రకం సరాసరి రూ.14వేల నుంచి రూ.20వేల మధ్యన కొనుగోలు చేస్తున్నారు. వండర్ హాట్ రూ.19వేల నుంచి రూ.37వేల వరకు, దీపిక రూ.15వేల నుంచి రూ.30వేలు, యూఎస్ 341 రకం రూ.14వేల నుంచి రూ.22వేలు, దేశీ రకం రూ.22వేల నుంచి రూ.42వేలు, సింగిల్ పట్టీ రూ.20వేల నుంచి రూ.39వేలు, 1048 రకం రూ.14వేల నుంచి రూ.20,500, ఎల్లో మిర్చి రూ.14వేల నుంచి రూ.20వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు.

తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్

ఈ యేడు మిర్చి సాగు తగ్గింది. రాష్ట్రంలోఉమ్మడి వరంగల్ , కరీంనగర్, ఖమ్మం జిల్లా పరిధిలో మిర్చి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈయేడు వర్షాలతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గింది.పెట్టుబడి కూడా పెరిగింది. ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టారు. దిగుబడి మాత్రం ఎకరాకు15 క్వింటాళ్లనుంచి 30 క్వింటాళ్ల మధ్యనే వస్తుంది. సరాసరి 20 నుంచి 25క్వింటాళ్ల మధ్యనే ఎక్కువగా దిగుబడి వస్తుంది. ఈ యేడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ పెరిగింది. కానీ, డిమాండ్ కు అనుగుణంగా ధర మాత్రం రావడం లేదు.

విదేశాలకు ఎగుమతి...

వరంగల్ లో కొనుగోలు చేస్తున్న మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ తో పాటు ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ప్రతియేడు విదేశాలకు కొంత మొత్తం ఎగుమతి చేస్తుండగా ఈయేడు పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో మిర్చికి డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా ఇక్కడి వ్యాపారులతో ఒప్పందం చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. ఈ యేడు మిర్చికి డిమాండ్ పెరుగిందని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ మార్కెట్ లో కొనుగోలు చేసిన మిర్చిని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ కు అత్యధికంగా సరుకు వస్తుందని కార్యదర్శి మల్లేషం తెలిపారు. గడిచిన వారం రోజులుగా మిర్చి రాక భారీగా పెరిగిందని, నెలాఖరు వరకు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Next Story