ఎర్ర బంగారంపై సిండికేట్ కన్ను..!

by velandi.Saikiran |   (  Updated:2026-03-05 07:29:40  IST  )

వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మిర్చి వ్యాపారులదే హవా. వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు ధర రావడం లేదు.

ఎర్ర బంగారంపై సిండికేట్ కన్ను..!
X

ఎర్రబంగారంపై సిండికేట్ కన్ను..!

=వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో వ్యాపారుల కుమ్మక్కు

=డిమాండ్ ఉన్నా మిర్చికి రాని ధర

=మార్కెట్ ను శాసిస్తున మిర్చి వ్యాపారులు

=పట్టించుకోని అధికారులు

=నష్టపోతున్న మిర్చి రైతులు

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మిర్చి వ్యాపారులదే హవా. వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు ధర రావడం లేదు. దేశ వ్యాప్తంగా మిర్చికి డిమాండ్ ఉన్నా మార్కెట్లో ఒకరిద్దరు రైతులకు మినహా ధర పెట్టడం లేదు. సిండికేట్ ధర నిర్ణయిస్తుండటంతో తక్కువ ధరకే అమ్మకాలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్ లో ముందే ధర నిర్ణయించి వేలం పాడటంతో రైతులకు ధర రావడం లేదు. ఆరుగాలం కష్టపడి రైతులు మిర్చి పండించి మార్కెట్ కు తీసుకువస్తే ధర రాకపోవడంతో నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.

ప్రతీరోజూ 30వేల బస్తాలు రాక..

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు నెలన్నర రోజులుగా మిర్చి భారీగా వస్తుంది. ప్రతీరోజు 30వేల బస్తాలకు పైగా మార్కెట్ కు రైతులు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా మార్కెట్ కు ఎక్కువ మొత్తంలో మిర్చిని తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు తేజా, వండర్ హాట్, 341, దీపిక, దేశీ, సింగిల్ పట్టి, ఎల్లోమిర్చితో పాటు ఇతర రకాలను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ప్రతీరోజు యూఎస్ 341, తేజా రకం ఎక్కువగా వస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. మార్కెట్ కు అత్యధికంగా వస్తున్న ఈ రకానికి తక్కువ ధర పెడుతున్నారు. తేజా రకం మిర్చికి గడిచిన నెలరోజులుగా వస్తున్న ధరలు పరిశీలిస్తే క్వింటాలు రూ.13వేల నుంచి రూ.19వేల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరికి క్వింటాలు రూ.19వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మిగతా అంతా రూ.13వేల నుంచి రూ.17వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. యూఎస్ 341 రకం క్వింటాలు రూ.14వేల నుంచి రూ.21వేల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. రైతులు ఏగ్రేడ్ రకాన్ని తెచ్చినా వ్యాపారులు కొంత మందివి మాత్రమే క్వింటాలు రూ.20వేల నుంచి రూ.21వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. ధర తగ్గించి క్వింటాలు రూ.14వేల నుంచి రూ.19వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. వండర్ హాట్ రకం రూ.17వేల నుంచి రూ.37వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దేశీ రకం క్వింటాలు రూ.18వేల నుంచి 41వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. సింగిల్ పట్టి రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య క్వింటాలుకు ధర పెడుతున్నారు. ఎల్లో మిర్చి రూ.18వేల నుంచి రూ.22వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు.

మార్కెట్​ను శాసిస్తున్న వ్యాపారులు..

వ్యాపారులు నిర్ణయించిందే మార్కెట్ లో ధరగా మారుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈయేడు పంట లేదు. అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా మిర్చికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ సంవత్సరం దిగుబడి భారీగా తగ్గి డిమాండ్ ఉన్నా మార్కెట్ లో మాత్రం వ్యాపారులే ధరను నియంత్రిస్తున్నారు. రైతులు ఎండబోసి ఏగ్రేడ్ మిర్చి తీసుకువచ్చినా ధర మాత్రం పెట్టడం లేదు. మెజార్టీ రైతులకు గరిష్ఠ ధర ఇవ్వాల్సి ఉన్నా మోడల్ ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి రైతులు ఈ ధరకు అమ్ముకుంటే ఏం మిగలదని రైతులు వాపోతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా ధర పెట్టి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మార్కెట్ కు ఆరంభానికి ముందే వ్యాపారులు మాట్లాడుకొని ధర నిర్ణయం చేస్తున్నారు. మార్కెట్ లో కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ కావడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అధికారులు ప్రభుత్వం పట్టించుకుంటే తప్ప డిమాండ్ ఉన్న మిర్చికి ధర వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్ లో నిత్యం మిర్చి కొనుగోళ్ల ను సమీక్షిస్తూ ధర వచ్చేవిధంగా చూస్తున్నామని కార్యదర్శి మల్లేశం తెలిపారు. వ్యాపారులతోను చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

Next Story