- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే : డాక్టర్ రాజయ్య
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని మాజీమంత్రి డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు.

దిశ, వరంగల్ బ్యూరో : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని మాజీమంత్రి డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు. స్టేషన్ ఘనపూర్‌లోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టినట్లేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే స్పీకర్ చదివినట్లుగా వ్యవహరించారని విమర్శించారు. పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఇచ్చిన అవకాశాలతో రాజ్యాంగ పదవులు అనుభవించి, ఇప్పుడు ఆయనను విమర్శించడం నైతికతకు విరుద్ధమని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో పార్టీ మారిన వారిని చట్టబద్ధంగా సీఎల్పీ విలీన ప్రక్రియ ద్వారా చేర్చుకున్నారని, కానీ ఎవరి ఇంటికీ వెళ్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పెద్ద పెండ్యాల సభలో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన కడియం శ్రీహరి, మరోసారి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని, ఇంకోసారి తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ చెప్పాలని అంటున్నారని విమర్శించారు. కడియం శ్రీహరికి నిజంగా నైతిక విలువలు ఉంటే బిఆర్ఎస్ కండువా కప్పుకుని స్టేషన్ ఘనాపూర్‌లో అడుగు పెట్టాలని రాజయ్య సవాల్ విసిరారు. చట్టసభ నుంచి తప్పించుకున్న కడియం శ్రీహరి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం, చట్టసభలు, కోర్టులపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వపు రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవని రాజయ్య అన్నారు.






