- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూభారతి పోర్టల్ తో భూ సమస్యలకు పరిష్కారం

దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ కు గతంలోని ధరణి పోర్టల్ కు చాలా తేడా ఉందని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. భూముల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం మరో 14 అంశాలను పొందుపరిచిందని తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. చట్టం, దాని పద్ధతులు అనే రెండు అంశాలను ప్రభుత్వం ఆధారంగా తీసుకొని భూమాతను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించిందని వివరించారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ) ను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షల లోపు ఉన్నపక్షంలో ఆర్డీవో స్థాయి,5 లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించారని తెలిపారు.
భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆరోజు నుంచి సంవత్సరకాలం లోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కాని పక్షంలో సీసీఎల్ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్త్ బోర్డు భూములను ఎవరైనా ఆక్రమించి పట్టాలు చేసుకున్న పక్షంలో కేసులను నమోదు చేయడం జరుగుతుందన్నారు. గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు ఏ మాత్రం ఉండవని అన్నారు. ప్రస్తుతం మండల తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిస్తారని తెలిపారు. జిల్లాలో వెంకటాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని, మే ఒకటి నుండి 31 వరకు పరిశీలన చేసిన అనంతరం జూన్ 2వ తేదీన పట్టాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా లోని మిగతా మండల కేంద్రాల్లో అవగహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక గ్రామ పరిధిలోని భూముల వివరాలు పూర్తిగా తహసిల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్, ఖజానా కార్యాలయంలో పొందుపరచడం జరుగుతుందని, జమాబంధు తరహాలో భూభారతిపోర్టల్ కొనసాగుతుందని అన్నారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.