మేడారం మహా జాతరకు రోడ్డు పనులు, భద్రతపై ప్రత్యేక దృష్టి..మంత్రి సీతక్క

by Bhanu |

మేడారం మహా జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా అధికారులను ఆదేశించారు.

మేడారం మహా జాతరకు రోడ్డు పనులు, భద్రతపై ప్రత్యేక దృష్టి..మంత్రి సీతక్క
X

దిశ, ములుగు ప్రతినిధి : మేడారం మహా జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరిష్, ఐటిడీఏ పీఓ చిత్ర మిశ్రా, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 2026లో జరిగే మేడారం మహా జాతరను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.


ఇప్పటికే రూ.33 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో శాశ్వత పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జాతర సమయంలో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, క్యూలైన్లు, షేడ్లు, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. పశువుల సంరక్షణ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాలలోని కాలువలు, గడ్డలు శుభ్రం చేయాలని, బలహీనమైన చెట్లను తొలగించాలని అటవీ శాఖను ఆదేశించారు.


లోతట్టు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని చెప్పారు. పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్, యాంటీబయోటిక్స్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, మలేరియా, డెంగ్యూకు వ్యతిరేకంగా ఫాగింగ్ మిషన్లు, టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులు ఒక బృందంగా పనిచేయాలని, కటాఫ్ గ్రామాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ పిచికారి, డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.భారీ వర్షాలు మరియు మేడారం జాతరను సవాలుగా స్వీకరించి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని, ప్రజల ప్రాణ రక్షణ, భద్రతే ప్రాముఖ్యం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఆర్డీఓ వెంకటేష్, మేడారం పూజారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




Next Story