మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి : మంత్రి సీతక్క

by Bhanu |

పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయడం మరియు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి : మంత్రి సీతక్క
X

దిశ, ములుగు ప్రతినిధి: పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయడం మరియు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో ఇవాళ జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ, ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా, మోసాలు, కుట్రలకు తావు లేకుండా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని,ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులకు రూ. 5 లక్షల సబ్సిడీతో ఇళ్లు మంజూరు చేయడం దేశంలోనే అరుదైన విషయమని,మిగిలిన రాష్ట్రాల్లో ఇంటికి గరిష్ఠంగా రూ. 3 లక్షల సహాయం అందిస్తే, మన తెలంగాణలో ఇది రూ. 5 లక్షలు అని మంత్రి తెలిపారు.

అనంతరం జగ్గన్నపేటలో మహిళల కోసం ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిబిరం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 175 మంది గ్రామీణ మహిళలకు ఒక్కొక్కరికి రూ. 15,000 విలువైన శిక్షణ పదార్థాలు, ఉపకరణాలు అందించగా, మొత్తం రూ. 26.25 లక్షల నిధులు వెచ్చించారు. 30 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోగలరని అధికారులు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇల్లాలి అక్షరాస్యత ఇంటికి వెలుగు ఆర్థిక అక్షరాస్యత దేశానికే వెలుగు మహిళలు కోటీశ్వరులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశయం అని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డల పేరుమీద మంజూరు చేస్తుండటమే దీని నిదర్శనమన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు సేవలు, ఆర్టీసీ బస్సుల అద్దె ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ వనరులు కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారతకు తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష, బాలల పరిరక్షణ అధికారి జె.ఓంకార్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రమాదేవి, డేటా ప్రో కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story