నేడు రెండో విడత ఎన్నికలు

by velandi.Saikiran |   (  Updated:2025-12-13 20:30:27  IST  )

ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే 2 గంటల నుంచి

నేడు రెండో విడత ఎన్నికలు
X

నేడు రెండో విడత ఎన్నికలు

=గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది

= అన్ని పోలింగ్ కేంద్రాల వద్దపోలీసుల భారీ బందోబస్తు

=గెలుపు కోసం భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు

=ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంటలకు వరకు పోలింగ్

=2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేడు జరిగే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది ఎన్నికలు జరిగే గ్రామాలకు తరలివెళ్లారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఏకగ్రీవ గ్రామాలను మినహాయించి మిగతా గ్రామాల్లో పోలింగ్ జరుపనున్నారు. ఈ ఎన్నికల కోసం పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లను చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 564 గ్రామ పంచాయతీలు, 4928 వార్డులలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, గీసుకొండ,, నల్లబెల్లి, సంగెం మండలాల పరిధిలో 117 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగనుంది. ములుగు జిల్లా పరిధిలో మల్లంపల్లి, వెంకటాపూర్, ములుగు మండలాల్లోని మొత్తం 52 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా పరిధిలో మొత్తం 72 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు, మహబూబాబాద్, దంతాలపల్లి, నర్సిములపేట, బయ్యారం, తొర్రూర్, పెద్దవంగడ, గార్ల మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా పరిధిలో భూపాలపల్లి, టేక్మట్ల, చిట్యాల, పలిమెల మండలాల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో ధర్మసాగర్, అసన్పర్తి, వేలేరు, ఐనవోలు, పరకాల మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేశారు.

పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు

ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే 2 గంటల నుంచి వార్డు, సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వెంటనే ఎన్నికైన వారి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని జిల్లాల పరిధిలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఉంచడంతో పాటు అవసరమైన ఏర్పాట్లను చేశారు. సివిల్, ఏ ఆర్, స్పెషల్ పోలీస్, గ్రేహౌండ్స్, హోంగార్డు తో పాటు ఇతర సిబ్బంది సేవలు వినియోగిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం భారీ ఎత్తున ఖర్చు చేశారు. పలు గ్రామాల పరిధిలో ఓట్ల కోసం మద్యం విచ్చలవిడిగా వెచ్చించారు. కొన్ని గ్రామాల పరిధిలో ఓటుకు వెయ్యి నుంచి రెండువేల వరకు ఖర్చు చేశారు. ఇదే కాకుండా ఇంటింటికి మద్యం, మటన్, చికెన్ తో పాటు కూల్ డ్రింక్ లను కూడా సరఫరా చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని గ్రామాలకు రప్పించడంతో పాటు వచ్చిపోయేందుకు ఖర్చులను కూడా పెట్టుకున్నారు. ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కావడంతో పూర్తిస్థాయిలో నజర్ పెట్టి అవసరమైన సహాయ సహకారాలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన అభ్యర్థులు నేడు జరిగే పోలింగ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరిని ఓడిస్తారో నేడు జరిగే ఎన్నికల్లో రెండవ విడత అభ్యర్థుల భవితల్యం తేలనుంది.

Next Story