- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంలో సరస్వతీ అంత్యపుష్కరాలు...ఈ నెల 21 నుంచే
కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది.

కాళేశ్వరంలో సరస్వతీ అంత్యపుష్కరాలు
=ఈనెల 21 నుంచి జూన్1వతేదీ వరకు నిర్వహణ
=ఏర్పాట్లకు రూ. 21.38 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
=12 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు
=30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా
=250ఎకరాల్లో పార్కింగ్.. ప్రముఖుల కోసం హెలీప్యాడ్ఏర్పాటు
దిశ, మహదేవపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ ఆధ్యాత్మిక ఘట్టానికి సుమారు 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నిధుల కేటాయింపు, ముమ్మరంగా పనులు..
పుష్కరాల సన్నాహక ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.1.20 కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు, వీఐపీ ఘాట్ వద్ద ప్లాట్‌ఫాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.2 కోట్ల వ్యయంతో పోచమ్మ గుడి నుంచి వీఐపీ ఘాట్ వరకు రోడ్డు పనులు, ముక్తేశ్వరాలయం వద్ద సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
250 ఎకరాల్లో పార్కింగ్..
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీల రాక కోసం ప్రత్యేక హెలీప్యాడ్ సైతం సిద్ధమవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
కాళేశ్వరంలోఆధ్యాత్మిక శోభ..
పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. కాశీ పండితుల ఆధ్వర్యంలో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు, రుద్రాభిషేకాలు, పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
హాజరుకానున్న పీఠాధిపతులు, ప్రముఖులు..
ఆది పుష్కరాల తరహాలోనే ఈ అంత్య పుష్కరాలకు కంచి పీఠాధిపతి సహా పలువురు ప్రముఖ పీఠాధిపతులు రానున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు..
నదీ హారతి & తెప్పోత్సవం: ప్రతిరోజూ సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నదీ హారతి, తెప్పోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు: ప్రతిరోజూ సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు.
ఆధ్యాత్మిక ప్రవచనాలు..
పలువురు ప్రముఖ ప్రవచనకర్తలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి మే 24 వరకు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రితో 'పుష్కర వైభవ ప్రవచనం'. ఈ నెల 23న మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావుతో ఆధ్యాత్మిక ప్రవచనం. జూన్ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మతో ఆధ్యాత్మిక ప్రవచనం. అలాగే, జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిగల్, మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతీ మహరాజ్, శ్రీ అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువు, శ్రీ యోగానంద సరస్వతీ స్వామిజీ, శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, శ్రీ శివానంద భారతి చింతామణి స్వామి, శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, శారదా పీఠం శ్రీ మాధవానంద సరస్వతి, తదితర పీఠాధిపతులు వస్తారని తెలిపారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక..
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. కాళేశ్వరంలో రాతి కట్టడాల నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 198 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలకు మరింత నిధులు రానున్న నేపథ్యంలో, ఈ ఏడాది అంత్య పుష్కరాలు తదుపరి మహా క్రతువుకు సన్నాహకంగా నిలవనున్నాయి.






