ఏజెన్సీ ఇసుక రీచ్‌ల‌లో ఇష్టారాజ్యం

by Ajay Maddhiboyina |

ఇసుక రీచ్‌ల‌లో అక్రమాలు య‌థేచ్ఛగా కొన‌సాగుతునే ఉన్నాయి. రీచ్‌ల‌లో అక్రమార్కులు అదనపు బకెట్​ దందాకు తెర‌లేపారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు ఏజెన్సీలో వెల్లువెత్తుతున్నాయి.

ఏజెన్సీ ఇసుక రీచ్‌ల‌లో ఇష్టారాజ్యం
X

దిశ‌, ఏటూరునాగారం: ఇసుక రీచ్‌ల‌లో అక్రమాలు య‌థేచ్ఛగా కొన‌సాగుతునే ఉన్నాయి. రీచ్‌ల‌లో అక్రమార్కులు అదనపు బకెట్​ దందాకు తెర‌లేపారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు ఏజెన్సీలో వెల్లువెత్తుతున్నాయి. నిబంధన‌ల మేర‌కు ఇసుక రీచ్‌ల నిర్వహ‌ణ కొన‌సాగాల్సి ఉండ‌గా అందుకు విరుద్ధంగా కొన‌సాగుత‌న్నాయ‌నే అరోప‌ణ‌లు ఉన్నాయి. రేయింబ‌వ‌ళ్లు బ‌హిరంగంగానే అక్రమాలు నిత్యకృత్యంగా కొన‌సాగుతున్నా అధికారులు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంలో ఆంతర్యమేటిటోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప‌ట్టుబ‌డుతున్న ఓవ‌ర్ లోడ్ లారీలు..

ఇసుక రీచ్‌లో అదనపు బకెట్ దందా కొన‌సాగుతుంద‌న‌డానికి ఇటీవ‌ల ఏటూరునాగారం చిన్నబోయినపల్లి వే బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద ప‌ట్టుబ‌డిన ఓవ‌ర్ లోడ్ ఇసుక లారీలే సాక్ష్యం. ఏటూరునాగారం, మంగ‌పేట మండ‌లాల ఇసుక రీచ్‌ల నుంచి అధిక లోడ్​తో వస్తున్న లారీల‌ను ఏటూరునాగారం పోలీసులు ప‌ట్టుకుని పోలీస్టేష‌న్ కు త‌ర‌లించి కేసు న‌మోదు చేశారు. ఇక్కడి వ‌ర‌కు బాగానే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ను నీరుగారుస్తూ అదన‌పు బ‌కెట్ దందాకు తెర‌లేపిన ఇసుక రీచ్‌ల‌పై టీజీఎండీసీ అధికారులు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. పట్టుబడిన లారీలు ఏ ఇసుక రీచ్ నుంచి వచ్చాయి? ఏ రీచ్‌లో అదనపు బకెట్ దందా కొసాగుతుందనేది ఆయా ఇసుక లారీల వే బిల్లులను పరిశీలిస్తే తెలిసిపోతుంది. కానీ, అధికారులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించడంలో విఫ‌ల‌మ‌వుతున్నట్లుగా తెలుస్తోంది.

చెక్​పోస్ట్ ల వ‌ద్ద అర‌కొర సిబ్బంది..

ఇసుక అక్రమ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల‌ మేర‌కు ఏటూరునాగారం చిన్నబోయిన‌ప‌ల్లి వే బ్రిడ్జి వ‌ద్ద రెవెన్యూ, మైనింగ్, పోలీస్‌, గ్రామ‌పంచాయ‌తీ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్‌పోస్టుల‌ను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేవారు. మొద‌ట్లో ఈ చెక్‌పోస్ట్‌ల వ‌ద్ద త‌నిఖీలు ముమ్మురంగా కొన‌సాగినా ప్రస్తుతం సంబంధిత శాఖల సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో తనిఖీలు నామమాత్రంగా మారాయి. దీంతో ఓవర్​లోడ్​తో ఇసుక లారీలు యథేచ్ఛగా త‌ర‌లుతున్నట్లు స‌మాచారం. చిన్నబోయిననపల్లి వేబ్రిడ్జి వ‌ద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో ఇటీవ‌ల తనిఖీలు నిలిచిపోయాయి. కాగా ఇటీవ‌ల దిశ ప‌త్రిక‌లో ‘ఓవ‌ర్ లోడ్‌కు గేట్లు ఓపెన్’ అనే శీర్షిక ఇసుక అక్రమ రవాణాపై కథనం ప్రచురితం కాగా స్పందించిన అధికారులు అదే రోజు నుంచి త‌నిఖీలు యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలో త‌నిఖీలు మొద‌లు పెట్టిన మూడు రోజుల్లో మూడు ఇసుక లారీలు అదనపు లోడ్​తో ప‌ట్టుబ‌డ‌డం గ‌మ‌నార్హం.

స్పందించ‌ని అధికారులు..

ఇసుక‌ రీచ్​ల‌లో కొన‌సాగుతున్న అక్రమాల‌పై దృష్టి సారించి చ‌ర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ‌ల అధికారులు ఉదాసీన‌త క‌న‌బ‌రుస్తున్నారు. రీచ్‌ల‌లో లోడింగ్ చార్జీలు, బ‌కెట్ దందా..వంటి అక్రమాలు యథేచ్ఛగా కొన‌సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంపై విమ‌ర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా అద‌న‌పు లోడ్‌తో ప‌ట్టుబ‌డిన ఇసుక లారీల విష‌యమై దిశ ములుగు జిల్లా టీజీఏండీసీ పీవో ను చ‌రవాణిలో సంప్రందించే ప్రయ‌త్నం చేయ‌గా ఆయ‌న అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు ఇసుక రీచ్‌ల‌లో కొన‌సాగుతున్న అక్రమాల‌పై దృష్టిసారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story