ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా..!

by velandi.Saikiran |

ప్రైవేట్ పాఠశాలల బస్సులపై ఆర్టీఏ, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 9గంటలకు మొదలైన తనిఖీలు 12 వరకు నిర్వహించారు.

ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా..!
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై ఆర్టీఏ, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 9గంటలకు మొదలైన తనిఖీలు 12 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ రోడ్ వైపున గల అక్షర, బిట్స్ పాఠశాల బస్సులను రోడ్డుపై ఆపేసి తనిఖీలు చేశారు. పలు బస్సులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. 40 మంది విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బస్సుల్లో 52 మందిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. మూడు బస్సులకు జరిమానా విధించారు. అనంతరం గీతాంజలి డీజీ పాఠశాలకు చేరుకుని అన్ని బస్సులను, మినీ బస్సులను తనిఖీ చేశారు. ఫైర్ ఎక్స్ట్రీమ్ గీషర్ లు 2022లో ఫిల్ చేసినట్లు గుర్తించారు. 2024లో మళ్లీ రీఫిల్ చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదన్నారు. ప్రథమ చికిత్స కిట్లు సరైనవి లేనట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఫిట్నెస్ లేని రెండు వాహనాలను స్టేషన్ కి తరలించారు. ఎల్లో ప్లేట్ లేని వాహనాలు సైతం విద్యార్థుల తరలింపులో వాడుతున్నట్లు గుర్తించారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరిగ్గా లేవని గుర్తించారు. అనంతరం డఫోడిల్స్ పాఠశాలలో సైతం బస్సులను తనిఖీ చేశారు. మొత్తంగా తొమ్మిది బస్సులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఉదయ్ కుమార్ సహా నర్సంపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై అరుణ్ సహా పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

పాటించాల్సిన అర్హతలివే..!

15 ఏండ్లు దాటిన బస్సుల్లో స్కూలు పిల్లలను తీసుకెళ్లకూడదు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు తప్పనిసరిగా ఆర్టీవో కార్యాలయం నుండి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. ప్రతీ బస్సు యెల్లో రంగులో ఉండాలి. బస్సు ముందు వెనక స్కూల్ బస్సు అని, పాఠశాల పేరు, ఫోన్ నెంబర్ స్పష్టంగా రాసి ఉండాలి. బస్సుకు అత్యవసర కిటికి, నార్మల్ కిటికీలకు అడ్డంగా గ్రిల్స్ ఉండాలి. బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. అగ్ని మాపక యంత్రాలు రెండు ఉండాలి. సీట్ల సామర్థ్యం 40 కన్నా ఎక్కువ విద్యార్థులను తరలించకూడదు. విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు వారి భద్రత కోసం అటెండర్ తప్పనిసరిగా ఉండాలి. దాదాపు 5ఏండ్ల అనుభవం కలిగిన డ్రైవర్స్ మాత్రమే బస్సును నడపాలి. అతనిపై ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల కేసులు వంటివి ఉండొద్దు. అతను యూనిఫాం, నేమ్ ప్లేట్ ధరించి ఉండాలి.

Next Story