రెవెన్యూ శాఖ‌లో వ‌సూళ్ల రాజాలు

by Bhanu |

రెవెన్యూ శాఖలో వ‌సూళ్ల ప‌ర్వం సాగుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

రెవెన్యూ శాఖ‌లో వ‌సూళ్ల రాజాలు
X

దిశ, ధర్మసాగర్ : రెవెన్యూ శాఖలో వ‌సూళ్ల ప‌ర్వం సాగుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రెవెన్యూ శాఖ‌లోని ఓ ఉద్యోగి అధిక వసూళ్లకు పాల్పడుతుండ‌డంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రెవెన్యూ కార్యాలయంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన ఓల్డ్ పహాణి ప్రతుల కోసం అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో నిర్దేశిత ఫీజుతో అందించాల్సిన పహాణి ప్రతులకు వెయ్యి రూపాయల నుండి 5వేల రూపాయల వరకు వసూల్లు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. డబ్బు ఇచ్చిన వారికి వెంటనే పత్రాలు అందగా, డబ్బు ఇవ్వనివారిని ఏదో ఒక కారణం చెప్తూ వారాల తరబడి తిప్పుతున్న పరిస్థితి ఏర్పడింది. వసూళ్ల‌ పర్వం సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నదని పలు ఆరోపణలు ఉన్నాయి. రికార్డు గదిలో ఉంటూ ఇప్పటికే అధిక వసూళ్లు చేసిన ఒక ఉద్యోగి స్థానంలో మరొక ఉద్యోగిని మార్చారు. ఇలా మార్చిన ఉద్యోగి సైతం వసూళ్లు మొదలెట్టాడు. ఇంతకు ముందు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగి, కొత్తగా వచ్చిన ఉద్యోగి ఇద్దరు రికార్డ్ రూంలో ఉంటూ అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగి ఉండగా అతనికి వేరే పనులకు వినియోగిస్తూ వసూళ్లు చేసేవారిని మాత్రం రికార్డు గదిలో ఉంచడంలో ఆంతర్యమేంటో. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story