- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో విద్యాకుసుమాలు.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
రాష్ట్రంలో ములుగు జిల్లా అతి చిన్నది. 80 శాతం వరకు ఏజెన్సీ ప్రాంతం ఉండడం, నిరక్షరాస్యలు ఎక్కువగా ఉండడంతో పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వెనుకంజ వేసేవారు.

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ములుగు జిల్లా అతి చిన్నది. 80 శాతం వరకు ఏజెన్సీ ప్రాంతం ఉండడం, నిరక్షరాస్యలు ఎక్కువగా ఉండడంతో పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వెనుకంజ వేసేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా సౌకర్యాలను కల్పింస్తోంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి మక్కువ చూపుతున్నారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అత్యధిక మార్కులు సాధించడానికి గ్రహిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని గిరిజనులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుంచి జీవనోపాధి కోసం వచ్చిన గుత్తికోయలు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. జిల్లాలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలలో 1,161 ఉపాధ్యాయులు, 14 వేల మంది విద్యార్థినీవిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
కంటైనర్ పాఠశాల ఏర్పాటు..
జిల్లాలో కొన్ని గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. కేవలం కాలి బాటన ఆయా గ్రామాలకు చేరుకునే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ గ్రామాల పిల్లలకు విద్య నేర్పించాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క, జిల్లా యంత్రాంగం కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏటూనాగారం మండలం గుర్రాల బావి, కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో ఇప్పటికే వాటిని ఏర్పాటు చేసింది. మామిడిగూడెం గ్రామంలో మరో కంటైనర్ పాఠశాలకు ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించడమే కాకుండా పిల్లలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.
కంపెనీల సహకారంతో ల్యాప్టాప్ల అందజేత..
పలు కంపెనీల యజమానులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలకు ఉచితంగా ల్యాప్టాప్లను అందజేస్తున్నారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి పలు కంపెనీల యజమానులతో మాట్లాడడంతో కంప్యూటర్లు అందజేయడానికి ముందుకు వచ్చారు. జిల్లాలో 17 పాఠశాలల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ద్వారా పాఠశాలల్లో వసతులు, చేపట్టాల్సిన పనులను అభివృద్ధి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రతీ పాఠశాలలో ఈ కమిటీలను ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఉపాధ్యాయులు బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు మూడు కస్తూర్బా విద్యాలయాలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల సహకారం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ప్రజా పాలన ప్రగతిప్రణాళికలో భాగంగా వారం రోజులపాటు నిర్వహించే విద్యా వారోత్సవాలలో ఇటీవల కలెక్టర్ సర్పంచ్, కౌన్సిలర్లకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని దిశానిర్దేశం చేశారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఐదు పాఠశాలలకు కంప్యూటర్ల పంపిణీ..
జిల్లాలోని టీఎస్ ఎంఎస్ చల్వాయి, బండారుపల్లి, జెడ్పీహెచ్ఎస్ మల్లంపల్లి, ఏటునాగారం, వెంకటాపూర్ గ్రామాలలోని పాఠశాలలకు దాతల సహకారంతో కంప్యూటర్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పదవ తరగతి ఫలితాలు మరింత బాధ్యత పెంచాయన్నారు.






