- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని, నాణ్యమైన విద్య ప్రమాణాలకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని, నాణ్యమైన విద్య ప్రమాణాలకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు నిరంతరంగా కృషి చేస్తూ లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక విద్య వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మండల, మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం విద్యార్థులను చేర్పించడం తో పాటు వారికి నాణ్యమైన విద్యాబోధన అందే విధంగా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని, బాల్యం నుండే నాణ్యమైన విద్యాబోధన అందిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, సమాజ నిర్మాణం లో బలమైన పునాది వేయడానికి పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి పలు చారిత్రాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలు అందించడం ద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ప్రభుత్వ విద్యపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో భాగంగా లైబ్రరీల ఏర్పాటుపై దృష్టి సారించాలని దీని ద్వారా స్థానిక ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరతాయని సూచించారు. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పనులపై పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ దృష్టి సారించాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. మునిసిపల్ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడానికి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నదని, స్థానిక కౌన్సిలర్లు ప్రభుత్వ పాఠశాలలను తరచు పర్యవేక్షిస్తూ విద్యార్థి సంఖ్య పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల క్రమ శిక్షణతో ములుగు జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించిందని, ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీతో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహిన్, జిల్లా అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






