"పెద్ది" కోసం ఊరూరా పూజలు..!

by Taduka Kalyani |

ఒక నాయకుడి పట్ల పార్టీ శ్రేణులకు అభిమానం ఉండటం సాధారణం కానీ డివిజన్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అతని క్షేమాన్ని కోరుతూ పూజలు, శివాలయాల్లో ప్రత్యేక హోమాలు, సర్వమత ప్రార్థనలు చేస్తున్న ఘటనలు నర్సంపేట నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో చోటు చేసుకుంటున్నాయి.

పెద్ది కోసం ఊరూరా పూజలు..!
X

దిశ, నర్సంపేట : ఒక నాయకుడి పట్ల పార్టీ శ్రేణులకు అభిమానం ఉండటం సాధారణం కానీ డివిజన్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అతని క్షేమాన్ని కోరుతూ పూజలు, శివాలయాల్లో ప్రత్యేక హోమాలు, సర్వమత ప్రార్థనలు చేస్తున్న ఘటనలు నర్సంపేట నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో చోటు చేసుకుంటున్నాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారనే వార్తతో కలత చెందిన ప్రజలు, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆరాటపడుతూ ప్రత్యేక హోమం, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామంలో సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలు ఒకే వేదికపై నిలబడి పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజల కోసం సేవ చేయాలని భగవంతుడిని వేడుకున్నారు. మతాలకు అతీతంగా గ్రామమంతా ఏకమై ప్రార్థనలు చేయడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.

శివాలయాల్లో ప్రత్యేక పూజలు ...

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లి. మండలంలోని గుండ్ల పహాడ్ గ్రామంలో గల త్రికూట శివాలయంలో పెద్ది త్వరగా కోలుకోవాలని అభిమానులు పార్టీలకతీతంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. శివాలయంలోని పూజారి రాజకోటయ్య శివునికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు.101 కొబ్బరికాయలను కొట్టి, శివునికి నైవేద్యం సమర్పించారు. నెక్కొండ మండలంలోని పెద్దకోర్పోలు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సంపేట మండలంలోని మాదన్నపేట శివాలయం, చెన్నరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో, దుగ్గొండి మండలంలోని పలు శివాలయాలు, హనుమండ్ల దగ్గర వేడుకుంటుండటం గ్రామ గ్రామాన సాధారణంగా మారింది. మరోవైపు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, పట్టణం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నిన్నటి నుండి యశోద ఆసుపత్రి వద్ద ఉన్నారు. అటు ఉమ్మడి జిల్లాలతో పాటు ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ది అభిమానులు కార్యకర్తలు పలు దేవాలయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

Next Story