- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్లో హమాలీలు, కూలీల జబర్దస్తీ.. ఏం జరుగుతుందో మీరే చూడండి!
ఏనుమాముల మార్కెట్ ఆసియాఖండంలోనే రెండో అతిపెద్దది. ఇతర మార్కెట్లకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యవహారాలు గాడితప్పినట్లు అర్థమవుతున్నాయి.

దిశ, వరంగల్ టౌన్ : ఏనుమాముల మార్కెట్ ఆసియాఖండంలోనే రెండో అతిపెద్దది. ఇతర మార్కెట్లకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యవహారాలు గాడితప్పినట్లు అర్థమవుతున్నాయి. ఒకపక్క ధరల తగ్గుదల, మరోపక్క హమాలీలు, కూలీల చేతివాటంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర తెలంగాణలో పెద్దదిక్కైన ఈ మార్కెట్‌లో ప్రతీ సీజన్‌లో జరుగుతున్న ఈ వ్యవహారం విస్మయం కలిగిస్తోంది. వివిధ రకాల పంటలకు సంబంధించి కొన్ని వేల బస్తాల సరుకు మార్కెట్‌కు వస్తుంది. ఈ క్రమంలో అడ్తీదారులు, ఖరీదుదారులు బస్తాల్లోని సరుకు నాణ్యతను పరిశీలించడానికి బస్తా కొంత భాగాన్ని కత్తితో కోస్తారు. అదే హమాలీలకు వరంగా మారుతోంది. కోసిన బస్తా కనపడితే చాలు కోతుల్లా ఎగబడి నడుముకు కట్టుకున్న లుంగీలో అందినంత దోపుకుని తమవెంట తెచ్చుకున్న ఖాళీ బస్తాలు నింపుకుంటున్నారు. ఇలా ప్రతీ సీజన్‌లో రోజుకు 10 క్వింటాళ్లకుపైగానే సరుకు హమాలీలు, కూలీలు జబర్దస్తీగా లాక్కుంటున్నట్లు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే ఆ రోజు ధర క్వింటా రూ.10వేలు ఉంటే రూ.లక్ష ఆదాయం హమాలీలు, కూలీల జేబులు నిండుతుండగా, రైతులు నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఈ లెక్కన సీజన్‌లో ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
మార్కెట్లో మరో మార్కెట్..
ఇలా రైతుల బస్తాల్లో నుంచి లాక్కున్న సరుకును అక్కడికక్కడే మార్కెట్లోనే చిల్లర కాంటాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల నుంచి సరుకు దోచుకోవడమే కాకుండా, మార్కెట్లోనే చిల్లర కాంటాలు నిర్వహించడం మార్కెట్ అధికారుల అంధత్వానికి అద్దం పడుతోంది. ఇక హమాలీలు, కూలీలు చేస్తున్న చేతివాటానికి ముద్దుగా ఆనవాయితీ అని పేరు పెట్టడం విచిత్రంగా అనిపిస్తోంది. రైతులకు, రైతులు తెచ్చే సరుకులకు మార్కెట్ అధికారులు పూర్తి భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మార్కెట్‌పై ఆధారపడిన హమాలీలు, కూలీలు నిలువునా రైతులను దోపిడీ చేస్తున్నా మార్కెట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం విధుల పట్ల వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది.
కంటితుడుపు చర్యలు...!
గతంలోనూ ఇలాంటి పరిస్థితులే మార్కెట్లో నెలకొంటే పలు పత్రికలు ఈ బాగోతాన్ని బట్టబయలు చేశాయి. అలా పత్రికల్లో వార్తలు వచ్చాయో లేదో తామున్నామంటూ అధికారులు చిల్లర కాంటాలను తరిమికొట్టారు. అంతేకాదు, హమాలీలతో మీటింగ్ ఏర్పాటు చేసి రైతుల సరుకు తీసుకోకూడదంటూ మాటలతో అప్పటికప్పుడు అడ్డుగోడలు కట్టారు. మళ్లీ ఇప్పుడు మిర్చి సీజన్ జోరుగా సాగుతున్న సమయంలో హమాలీలు, కూలీలు ముద్దుగా పిలుచుకునే ఆనవాయితీ, చేతివాటం ముమ్మరంగా జరుగుతోంది.
ఈ అలవాటు ఎక్కడిది?
మార్కెట్లో రైతుల సరుకును దౌర్జన్యంగా లాక్కోవడం ఆనవాయితీగా రావడం ఏమిటని ఆరా తీస్తే విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి హమాలీలకు రైతులు తెచ్చిన సరుకుపై బస్తాకు ఇంత అని రైతుల నుంచే వసూలు చేస్తారు. అది హమాలీలకే చెందాలి. కానీ, ఇక్కడ ఆ సొమ్ము అంతా హమాలీ లీడర్లకు దారాదత్తం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బస్తాలపై వచ్చిన డబ్బునంతా వారే పంచుకుంటున్నారని హమాలీలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో తాము ఎలా బతకాలని, అందుకే రైతుల నుంచి సరుకు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఒకపక్క బస్తా ఒక్కంటికి హమాలీ రుసుము వసూలు చేయడమే కాకుండా, సరుకు దోపిడీతో నష్టం జరిగేదీ రైతుకే. రెండు రకాలుగా రైతు మీద భారం పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించలేకపోవడం రైతుల శ్రేయస్సు పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తోంది. పత్రికల్లో వార్తలు రాగానే హమాలీలకు క్లాస్ ఇవ్వడం, చిల్లర కాంటాలను తరిమికొట్టడంపై ఉన్న శ్రద్ధ శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా హమాలీల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి తగిన బుద్ధి చెప్పడంతోపాటు రైతుల నుంచి వసూలు చేస్తున్న రుసుము, పనిచేసే హమాలీలకు చెందేలా చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలి. అలాగే, చిల్లర కాంటాల నిర్వహణపై ఉక్కుపాదం మోపాలి. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు మార్కెట్ ఉన్నతాధికారులతోపాటు మార్కెట్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే మార్కెట్లో అక్రమంగా కొనసాగుతున్న ఆనవాయితీకి అడ్డుకట్ట పడదు. రైతులకు న్యాయం జరగదు.






