- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మహబూబాబాద్ టౌన్ : రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలను మోసగించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు మళ్లీ రంకెలు వేస్తున్నారని, అలాంటి వారిని ఈసారి తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి బుద్ధిచెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం మహబూబాబాద్ మండలంలోని సోమాల తండాలో "ప్రజాపాలన ప్రగతిబాట" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయిక్, ఎమ్మెల్యేలు మురళీనాయిక్, కనకయ్య, నాగరాజు, విప్ రామచంద్రనాయిక్, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి దాదాపు ₹100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన 18 నెలల్లో తమ ప్రభుత్వం పేదల్ని క్షేమంగా చూసుకుంటూ సంక్షేమ పథకాలను కొనసాగించిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుబంధు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు ప్రజలకు అందించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు 10 ఏళ్లలో ₹17 వేల కోట్లు రుణమాఫీ చేస్తే, తాము కేవలం 10 నెలల్లోనే ₹21 వేల కోట్లు మాఫీ చేశామని, 9 రోజుల్లో ₹9 వేల కోట్ల రైతు భరోసా నిధులు పంపిణీ చేశామని వివరించారు. ఈ నియోజకవర్గంలో నాలుగు వేలకుపైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకులు పథకాలపై తాము చేస్తున్న కృషిని చూసి అసహనంతో రోడ్లపై దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ హైదరాబాద్‌లో రైతుల విషయంలో మొసళ్ల కన్నీళ్లు కార్చి, సీఎం రేవంత్ రెడ్డిపై దుర్వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఈ సభే వారికి సరైన సమాధానమని అన్నారు.
“పది ఏళ్లపాటు గాదె కింద పందికొక్కుల్లా పాలించిన వారిని ఇప్పటికే ప్రజలు రెండు సార్లు గుండు కొట్టారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వారికి మరోసారి బుద్ధిచెప్పాలి. ఇందిరమ్మ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. మీరు చేసే అరాచకాలకు తగిన శిక్ష తప్పదు” అంటూ బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వేదికపై నుంచే మంత్రి పొంగులేటి ఆయనకు నివాళులు అర్పించారు.






