వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్రత్యేక చ‌ర్యలు

by velandi.Saikiran |

వ‌రంగ‌ల్ జిల్లాలో చేప‌ట్టిన వివిధ ప్రగ‌తి ప‌నులు వ‌చ్చే జూన్ 2వ తేదీ క‌ల్లా పూర్తి కావాల‌ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా ప‌నిచేయాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు.

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్రత్యేక చ‌ర్యలు
X

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్రత్యేక చ‌ర్యలు

=త్వర‌లో ఎంజీఎం హాస్పిట‌ల్ ప్రారంభం

=అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

=యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ధి ప‌నులు

=మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

=వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్ధిపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో సుదీర్ఘ స‌మీక్ష

దిశ వరంగల్ బ్యూరో: వ‌రంగ‌ల్ న‌గ‌ర స‌మ‌గ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్రభుత్వం ప్రత్యేక చ‌ర్యలు తీసుకుంటోంద‌ని, ప్రభుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్ధిపై దేవాదాయ, అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖతో క‌లిసి స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి ప‌ర‌చాల‌న్న కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమ‌లులో వేగం పెంచాల‌ని, ప్రజ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు.

జూన్​ 2 వరకు పనులు పూర్తికావాలి..

హైద‌రాబాద్ త‌ర్వాత అత్యంత ప్రాధాన్యత క‌లిగిన ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో చేప‌ట్టిన వివిధ ప్రగ‌తి ప‌నులు వ‌చ్చే జూన్ 2వ తేదీ క‌ల్లా పూర్తి కావాల‌ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా ప‌నిచేయాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు. భ‌ద్రకాళి ఆల‌య అభివృద్ధి ప‌నులు, భ‌ద్రకాళి చెరువు డీ సిల్టేష‌న్ అంశాల‌కు సంబంధించి ఆల‌య మాడ‌వీధుల్లో కృష్ణశిల‌తో నిర్మాణం చేసేందుకు త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. భ‌ద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ఇన్ ఫాల్ అవుట్ ఫాల్ విష‌యంలో భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాప‌న చేసి గాలికి వ‌దిలేసిన వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేశామ‌ని జూన్ నాటికి ప్రజ‌ల‌కు అందుబాటులోకి తెచ్చే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ ఆసుప‌త్రి నిర్మాణ ప‌నులు, సామ‌గ్రి ఏర్పాటు, డాక్టర్లు, సిబ్బంది నియామ‌కానికి స‌త్వర‌మే కార్యాచ‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డుకు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ భూసేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు

భూగర్భ డ్రైనేజీకి టెండర్లు పూర్తిచేయాలి..

వ‌రంగ‌ల్ ప‌ట్టణంలో రూ.5,257 కోట్లతో చేప‌ట్టే భూ గ‌ర్భ డ్రైనేజీ ప‌నులకు సంబంధించి వెంట‌నే టెండ‌ర్ ప్రక్రియ‌ను పూర్తి చేసి వ‌చ్చేనెల‌లో ప‌నుల‌ను ప్రారంభించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న టూబీహెచ్‌కే ఇండ్లకు ఈ నెల 31లోగా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసి కేటాయించాల‌ని సూచించారు. టూబీహెచ్‌కే కాల‌నీల్లో క‌రెంట్, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి క‌నీస సౌక‌ర్యాల‌ను ఆనాటి ప్రభుత్వం విస్మరించింద‌ని, త‌క్షణ‌మే ఆయా కాల‌నీల్లో క‌నీస వ‌స‌తుల ఏర్పాటు చేయాల‌ని, ఇందుకు అవ‌స‌రమైన బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌లు పంపిస్తే నిధుల మంజూరు చేస్తాన‌ని తెలిపారు. స‌మావేశంలో ఎమ్మెల్యేలు క‌డియం శ్రీ‌హరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగ‌రాజు, నాయిని రాజేంద‌ర్‌ రెడ్డి, శాస‌న‌మండ‌లి స‌భ్యులు బ‌స్వరాజు సార‌య్య, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ క‌లెక్టర్లు పాల్గొన్నారు.

Next Story