పీఎంకేఎస్‌వై కింద మరో స్కీమ్ అమలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగమైన మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ (ఎం-క్యాడ్‌డబ్ల్యూఎం) పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పీఎంకేఎస్‌వై కింద మరో స్కీమ్ అమలు
X
  • రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగమైన మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ (ఎం-క్యాడ్‌డబ్ల్యూఎం) పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం జీఓ 320 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖను నోడల్ శాఖగా నియమించింది. సంబంధిత క్లస్టర్‌కు చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్/చీఫ్ ఇంజినీర్‌ను రాష్ట్ర ప్రాజెక్టు అమలు సంస్థగా, ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) కార్యాలయంలోని సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని 2026 ఏప్రిల్ నుంచి జాతీయ కార్యక్రమంగా అమలు చేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుల విజయాన్ని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అనువైన ప్రాజెక్టులను ప్రతిపాదించాలని కేంద్రం కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

కాగా.. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్థిక, ప్రణాళిక, పంచాయతీరాజ్, అటవీ శాఖల ఉన్నతాధికారులతోపాటు ఈఎన్సీ, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్రంలో పథకం అమలుపై పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఇతర పథకాలతో అనుసంధానం, అమలులో అవసరమైన నిర్ణయాల తీసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తించనుంది.

జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు

ఈ పథకం సమర్థవంతంగా అమలుకు ప్రభుత్వం జీఓ 321 ద్వారా ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి అమలు కమిటీలను ఏర్పాటు చేయనుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీలో సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యానశాఖ అధికారి, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారి, వాటర్ యూజర్ సొసైటీల ప్రతినిధులు, మహిళా ప్రతినిధి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఎంసీఏడీ పథకం అమలులో జిల్లాస్థాయిలో ప్రణాళికల రూపకల్పన, క్లస్టర్ల ఎంపిక, వాటర్ యూజర్ అసోసియేషన్ల ఏర్పాటు, భూసర్వేలు, రైతులతో సంప్రదింపులు, ఇతర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అవసరమైతే భూసేకరణ, రైట్ ఆఫ్ వే, పంట నష్టపరిహారం, భూ వివాదాల పరిష్కారంలో కూడా చర్యలు తీసుకోనుంది. అలాగే.. ప్రాజెక్టు నిర్మాణ దశలో వివిధ శాఖల మధ్య సమన్వయం, నాణ్యత పర్యవేక్షణ, చట్టం-శాంతిభద్రతల పరిరక్షణ, పనుల్లో జాప్యాల నివారణ, రైతులకు ప్రాజెక్టు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది. పనులు పూర్తయ్యాక నీటి పారుదల నిర్వహణను దశలవారీగా వాటర్ యూజర్ సొసైటీలకు అప్పగించే ప్రక్రియను కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, మహిళలు, బలహీన వర్గాల భాగస్వామ్యం, ఫిర్యాదుల పరిష్కారం, వనరుల సమీకరణ, సీఎస్‌ఆర్ నిధుల వినియోగం వంటి అంశాలపైనా కమిటీ చర్యలు చేపట్టనుంది.

Next Story