చెరువులు కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి : ఎమ్మెల్యే గండ్ర‌ స‌త్య‌నారాయ‌ణ‌రావు

by Nallavelli.Anjaneyulu |

చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించి హద్దులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

చెరువులు కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి :  ఎమ్మెల్యే గండ్ర‌ స‌త్య‌నారాయ‌ణ‌రావు
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించి హద్దులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి దత్తత తీసుకున్న వార్డులల్లో సీఎస్ఆర్, డిఎం ఎఫ్టి నిధులతో విద్యుత్తు, మంచినీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి దత్తత కాలనీలలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని, సింగరేణి, మున్సిపాల్టీ మాది కాదంటే మాది కాదని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పారిశుద్యం, మంచినీటి సరఫరా అభివృద్ధి బాధ్యత సింగరేణి తీసుకోవాలని తెలిపారు. ఫారెస్ట్, సింగరేణి, రెవెన్యూ భూ సమస్య పరిష్కారానికి సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాల్టీ పరిధిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొన్ని వార్డులలో మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్ లీకేజీ, మరమ్మత్తులు చేయడం లేదని మరమ్మతులు నిర్వహించాలని తెలిపారు.చేతి పంపులు మరమ్మతులు నిర్వహించి మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్ద చెరువు బండ్ ను అభివృద్ధి చేయాలన్నారు.తుమ్మల చెరువును కోటి రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి చేశామని, ఇంకా ఉన్న చెరువులను సింగరేణి అభివృద్ధి చేయాలని తెలిపారు.19, 30 వార్డుల మధ్య ఉన్న పాత వాటర్ ట్యాంకును తొలగించాలని తెలిపారు.


గత10 సంవత్సరాల నుంచి సింగరేణి వార్డులలో అభివృద్ధి నిర్వీర్యం అయిందని, గెలిచినా ఓడినా అభివృద్ధి జరగాలని అన్నారు. దేవాలయాలు రహదారుల అభివృద్ధికి సింగరేణి ఆటంకం కలిగించొద్దని తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలోని అన్ని వార్డులలో హెచ్ పివి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వసతి గృహాలు సంక్షేమ అధికారులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అవగహన కల్పించి వాక్సిన్ ఇప్పించాలని తెలిపారు. కోతుల సమస్య నివారణకు సింగరేణి, మున్సిపల్ సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన కోతులు పట్టించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సింగరేణి ఉపరితల గని బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు పగుళ్లు వస్తున్నాయని రక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. కావాల్సిన నిధుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story