అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఆకస్మిక దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం

by Kodari Anjali |

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ పరిధిలోని తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఆకస్మిక దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
X

దిశ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ పరిధిలోని తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల అందిన ఫిర్యాదులు, విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడుల్లో పలువురు అక్రమ వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, అప్పులకు సంబంధించిన రికార్డులు, ఇతర కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వడ్డీ వ్యాపారానికి సంబంధించి అవసరమైన అనుమతులు లేకుండా అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పుల పేరుతో ప్రజలను వేధించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడినా లేదా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు బలవంతంగా తీసుకుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ప్రజలు అత్యవసర అవసరాల కోసం గుర్తింపు పొందిన బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారానే రుణాలు తీసుకోవాలని, చట్టవిరుద్ధ వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారాలను పూర్తిగా అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

Next Story