పరిమితికిమించి ప్రయాణం.. ప్రమాదమని తెలిసినా పట్టించుకోని ప్రజలు?

by Kodari Anjali |

ఆటోల్లో ఓవర్లోడ్ ప్రయాణాలు ప్రమాదమని తెలిసినా ప్రజలు తమ అవసరాల కోసం ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

పరిమితికిమించి ప్రయాణం.. ప్రమాదమని తెలిసినా పట్టించుకోని ప్రజలు?
X

దిశ, మంగపేట: ఆటోల్లో ఓవర్లోడ్ ప్రయాణాలు ప్రమాదమని తెలిసినా ప్రజలు తమ అవసరాల కోసం ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. జూన్ నెల రెండవ వారం నుండి గ్రామీణంలో వర్షాకాలం పంటల సీజన్ పనులు ప్రారంభం అవుతుండడంతో రైతులు, కూలీలు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఎరువుల షాపుల్లో విత్తనాల కొనుగోల్ల కోసం మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలు అవకాశం ఉంటే ఆర్టీసీ బస్సుల్లో లేకుంటే ఆటోల్లో చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిభందనల మేరకు డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణించే ఆటోల్లో డబ్బులకు కక్కుర్తిపడే ఆటో యజమానులు, డ్రైవర్లు ఒక్కో ఆటోలో 10 నుండి 15 మందితో ఓవర్లోడ్ ప్రయాణం చేస్తున్నారు. సకాలంలో రవాణా సౌకర్యం లేని ప్రజలు గత్యంతరం లేక ప్రయాణం ప్రమాదమని తెలిసినా ఆటోల్లో ఎక్కిరావడం తప్పడంలేదు. ఆర్టీఏ నిభందనల ప్రకారం ఒక్కో ఆటోలో డ్రైవర్తో పాటు నల్గురు ప్రయాణించాలున్నా అవేమి పట్టించుకోకుండా ఒక్కో ఆటోలో 10 నుండి 15 మందిని ఎక్కించుకుంటున్నారు.

గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు..

ప్రయాణం అనుకూలిస్తే పర్వాలేదు కాని అనుకోని ఘటనలో ఆటో ప్రమాదానికి గురైతే ఆకుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని ప్రయాణీకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓవర్లోడ్ ప్రయాణాలను నియంత్రించాల్సిన ఆర్టీఏ, పోలీస్ అధికారులు ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం మండల కేంద్రానికి చెరుపల్లి, తిమ్మంపేట, మల్లూరు, రమణక్కపేట, రాజుపేట, కోమటిపల్లి, తొండ్యాల, నర్సాయిగూడెం, బుచ్చంపేట, కమలాపురం, నర్సింహాసాగర్, చుంచుపల్లి తదితర గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు ఆర్టీసీ, స్వంత వాహనాలు, ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై వస్తుంటారు. ప్రధానంగా మంగపేట-భద్రాచలం ప్రధాన రహదారిలో వందలాదిగా ఇసుక లారీలు ఓవర్ లోడ్, అధిక స్పీడ్ తో రాకపోకల రద్ధీ తీవ్రంగా ఉంటుంది. మండలంలో నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కనుక ఆటోల్లో ప్రయాణించే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోని ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీఏ, పోలీసు అధికారులు స్పందించి ఆటోల్లో ఓవర్లోడ్ ప్రయాణాలు, మైనర్ల బైక్ రైడ్స్, ద్విచక్రవాహనాలపై త్రిబుల్ రైడ్స్ పై దృష్టి సారించి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story