నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద రికార్డు.. ప్రధాని మోడీ అభినందనలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-06 10:43:15  IST  )

భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద రికార్డు.. ప్రధాని మోడీ అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నార్వే రాజధాని అయిన ఒస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ పై చివరి రౌండ్ లో ఘనవిజయం సాధించి .. టైటిల్ ను అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. దీంతో ప్రజ్ఞానందపై యావత్ దేశం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ప్రజ్ఞానందను అభినందించారు. ప్రజ్ఞానంద అందుకున్న ఈ విజయాన్ని ఒక అద్భుతమైన మైలురాయిగా అభివర్ణిస్తూ.. మోడీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. "అద్భుతమైన విజయాన్ని సాధించిన ప్రజ్ఞానందకు నా హృదయపూర్వక అభినందనలు. నిరంతర ప్రతిభకు ఈ మైలురాయి ఒక నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. " అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీలు సైతం ప్రజ్ఞానందను ప్రశంసలతో ముంచెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా ప్రజ్ఞానంద ప్రదర్శనను ప్రశంసించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి ఈ చారిత్రాత్మక టైటిల్‌ను సొంతం చేసుకోవడం తమిళనాడుకు, దేశానికి గర్వకారణమన్నారు. ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడమే కాకుండా, వరుసగా నాలుగు విజయాలతో సరికొత్త రికార్డును లిఖించాడని సీఎం కొనియాడారు. అలాగే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రజ్ఞానంద ఆటను 'మ్యాజికల్' అని అభివర్ణించారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే, ఎంతో అనుభవజ్ఞుడైన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడం మామూలు విషయం కాదని, ప్రగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని సచిన్ ఆకాంక్షించారు.

Next Story