జ‌డ్చ‌ర్ల‌కు గోరంత హామీ కూడా ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలకు చివరకు నిరాశే ఎదురైంది.

జ‌డ్చ‌ర్ల‌కు గోరంత హామీ కూడా ఇవ్వని  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల/నవాబుపేట : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలకు చివరకు నిరాశే ఎదురైంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సభా వేదికపై స్పష్టంగా, గట్టిగా విన్నవించినప్పటికీ ముఖ్యమంత్రి నుంచి అందుకు సంబంధించిన ఒక్క అంశంపైనా స్పష్టమైన హామీ రాకపోవడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, జడ్చర్ల రింగ్ రోడ్ నిర్మాణం, బస్సు డిపో, కొత్త పోలీస్ స్టేషన్లు, ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నూతన మండలాల ఏర్పాటు వంటి కీలక అంశాలను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.

స్థానిక అభివృద్ధి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎక్కువగా రాజకీయ విమర్శలకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ప్రజలు వరాల కోసం ఎదురుచూస్తే.. సభ బీఆర్ఎస్‌, బీజేపీలపై విమర్శల వేదికగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలకు తగిన ముఖ్యమంత్రి నుంచి తగిన స్పందన రాకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో భారీగా నిర్వహించిన ఈ సభ స్థానిక సమస్యల సాధన పరంగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందనే అభిప్రాయలు నియోజకవర్గ ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అలాగే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వ హామీలపైనా ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ హామీలు ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతాయనే చర్చ జరుగుతోంది. స్థానిక‌ సమస్యలపై ఎమ్మెల్యే గట్టిగా స్వరం వినిపించినా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో జడ్చర్ల ప్రజలకు ఈ పర్యటన ఆశలకంటే నిరాశనే ఎక్కువగా మిగిల్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story