పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేయాలి

by Ratna Kumari |

మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌ర్ స్నేహ శ‌బ‌రిష్ గురువారం తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధంగా ఉన్న రెండు పడకల గదుల ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు.

పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేయాలి
X

దిశ‌, తొర్రూర్ : మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌ర్ స్నేహ శ‌బ‌రిష్ గురువారం తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధంగా ఉన్న రెండు పడకల గదుల ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ నాణ్యత, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల వద్ద ఇంకా మిగిలి ఉన్న పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను అందజేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యం పేదలకు గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమేనని, పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు.


అనంతరం తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ధాన్యం విక్రయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగుల అందుబాటు, రవాణా సౌకర్యాలు, రైతులకు చెల్లింపుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సివిల్ సప్లైస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story