- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పకడ్బందీ ఏర్పాట్లతో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి
గ్రామ పంచాయితీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

దిశ, వరంగల్ బ్యూరో : గ్రామ పంచాయితీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో పోలీస్ విభాగం పూర్తి స్థాయి సిద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తదుపరి మూడు విడతల్లో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు సంబంధించి స్టేషన్ వారీగా గ్రామ పంచాయితీల వివరాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు. నామినేషన్ల దశ నుండి ఫలితాల వరకు అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా గతంలో కేసులు నమోదైన నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులను ముందుగానే బైండోవర్ చేయాల్సిందిగా సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో పక్క జిల్లాల నుంచి అదనపు ఫోర్స్ రాకపోవచ్చని, అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకోవాలని సీపీ చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లైసెన్సు పొందిన ఆయుధ యజమానులు తమ ఆయుధాలను సమీప పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయించేందుకు అధికారులే చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తదనంతరం పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, నేరాల నియంత్రణ చర్యలపై కమిషనర్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చైతన్య, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్‌తో పాటు ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.






