రికార్డుల్లో ఒకలా.. ఫీల్డ్‌లో మరోలా.. ఉపాధి హామీ పనులు

by Ratna Kumari |

మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

రికార్డుల్లో ఒకలా.. ఫీల్డ్‌లో మరోలా.. ఉపాధి హామీ పనులు
X

దిశ, శాయంపేట : మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై జరిగిన పరిశీలనలో రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో తేడాలు ఉన్నట్టు సామాజిక తనిఖీ ద్వారా వెళ్లడైనట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. సామాజిక తనిఖీలో పలు గ్రామాల్లో జరిగిన పనులపై పరిశీలన చేపట్టగా.. కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో చెరువుల పూడ్చికత పనులకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరో గ్రామంలో కొబ్బరి మొక్కల పేరుతో రికార్డుల్లో 118 మొక్కలు నాటినట్లు చూపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిశీలించగా కేవలం 52 మొక్కలు మాత్రమే ఉండగా మిగతా మొక్కలు లేవని వెల్లడించారు.

కార్మికుల హాజరు నమోదులో కూడా తేడాలు ఉన్నట్లు తెలిపారు. మూడు రోజులు పని చేసినట్లు మాస్టర్ రోల్‌లో నమోదు ఉన్నప్పటికీ ఒక‌ రోజు హాజరు కొట్టి వేసినట్టు ఘటనలు గుర్తించబడ్డాయి. దీంతో కార్మికులకు నష్టం కలిగినట్లు వెల్లడించారు. మరికొన్ని చోట్ల రికార్డుల్లో ఆరు రోజులు పని చేసినట్లు నమోదు ఉన్నప్పటికీ సంతకాలలో తేడాలు గమనించినట్లు తెలిపారు. మాస్టర్ రోల్ మూసివేసిన తరువాత కూడా కొన్ని రోజుల పేమెంట్లు జరిగినట్లు చర్చలో ప్రస్తావించారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామస్థాయిలో ఐదుగురు సభ్యులతో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, చాలా గ్రామాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ పథకంలో భారీ మొత్తంలో పనులు జరుగుతున్నప్పటికీ కొన్నిచోట్ల పర్యవేక్షణ లోపించడం వల్ల రికార్డులు, క్షేత్రస్థాయి పనుల్లో తేడాలు కనిపిస్తున్నాయని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ప‌లు గ్రామాల్లో రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈజీఎస్ సిబ్బంది సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామాల్లో రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం గమనించినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని తెలుస్తోంది.

Next Story