నాడు రక్షణ నిలయం.. నేడు నేరాల నిలయం

by Kodari Anjali |

డోర్నకల్​మున్సిపాలిటీ పరిధిలోని పాత పోలీస్ క్వార్టర్స్ స్థలం ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాడు రక్షణ నిలయం.. నేడు నేరాల నిలయం
X

దిశ, డోర్నకల్: డోర్నకల్​మున్సిపాలిటీ పరిధిలోని పాత పోలీస్ క్వార్టర్స్ స్థలం ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడుబడిన క్వార్టర్లు, పిచ్చిమొక్కలు, దట్టమైన చెట్లతో నిండిన ఆ ప్రాంతం తాగుబోతులకు, జూదరులకు స్థావరంగా మారింది. ముఖ్యంగా మహిళలు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. స్థానికులకు సమస్యగా మారిన సుమారు రెండు ఎకరాల ఈ విలువైన ప్రభుత్వ భూమిని తక్షణమే మున్సిపాలిటీకి అప్పగించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. డోర్నకల్​పట్టణ నడిబొడ్డున నాడు శాంతిభద్రతలను కాపాడిన పోలీస్ కార్యాలయ ప్రాంగణం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎంతో కీలకమైన ప్రాంతంలో ఉన్న సుమారు రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రభుత్వ భూమి, పోలీస్ కార్యాలయం కొత్త భవనంలోకి మారినప్పటి నుంచి దాదాపు 40 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. హోమ్ శాఖ ఆధీనంలో ఉన్న ఆ స్థలం పిచ్చిమొక్కలు, దట్టమైన పొదలతో అడవిని తలపిస్తోంది. నాడు ప్రజలకు రక్షణగా నిలిచిన ప్రాంగణం, నేడు అక్రమార్కులకు ప్రధాన స్థావరంగా మారింది. చీకటి పడితే ఈ ప్రాంతం వైపు వెళ్లడానికి స్థానిక ప్రజలు, మహిళలు, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రజా భవనాలు నిర్మించాలి..

పట్టణంలోని పాత పోలీస్ క్వార్టర్స్ ప్రాంతం పొదలు పెరగడంతో ప్రమాదం పొంచిఉంది. ప్రజా భవనాలు కడితేనే పట్టణానికి అందం అనే నినాదం స్థానికంగా బలంగా వినిపిస్తుంది. రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చారిత్రక స్థలం ఏళ్ల తరబడి వృథాగా ఉండడంతో దట్టంగా చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తుంది.అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. చీకటి పడితే మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకప్పుడు ప్రజలను కాపాడిన ప్రాంగణం.. నేడు ప్రజలను భయపెట్టే స్థావరంగా మారిందని వాపోతున్నారు. నిరుపయోగంగా ఉన్న స్థలంలో ప్రజల సౌకర్యార్థం ఫంక్షన్ హాల్, పిల్లలు,వృద్ధుల కోసం ఆహ్లాదకరమైన పార్కు, ప్రజా భవనాలు నిర్మించాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.

రెండు ఎకరాల స్థలం.. రెండు పరిష్కారాలు..

ప్రజా ఆస్తి అసాంఘిక కార్యకలాపాలకు వేదిక కావడం కంటే, దీనిని ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం అనుమతించాలని మున్సిపల్​వైస్ చైర్ పర్సన్ మాదా లావణ్య శ్రీనివాస్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా,రామచంద్రనాయక్ ద్వారా కలెక్టర్ స్నేహ శబరీష్​కు వినతి పత్రాన్ని అందించారు. 2018లో సర్పంచ్ గా ఉన్న సమయంలో అప్పటి జిల్లా ఎస్పీకి విన్నవించినట్లు గుర్తు చేశారు. పాత పోలీస్ క్వార్టర్స్ భూమి సర్వే నెం 21/1లో 30 గుంటలు,24/1లో 1:10 గుంటలు మొత్తం 2.00 ఎకరాలు ఉంది. దీన్ని ఆనుకొని మరికొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పోలీస్ స్టేషన్ కు లయన్స్ క్లబ్ సంస్థ ఎకరన్నర స్థలాన్ని అందించారు. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీకి బదిలీ చేయడంతో నిరుపేద కుటుంబాలకు రాజీవ్ గృహకల్ప ద్వారా బహుళ అంతస్తులు నిర్మిస్తే పేదల సొంతింటి కల నెరవేరుతుంది. ప్రస్తుతం పట్టణంలోని పలు ప్రభుత్వ శాఖలు సొంత భవనాలు లేక ప్రైవేట్ కాంప్లెక్స్‌ల్లో ఉంటూ నెలకు లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని అద్దెల రూపంలో వృథా చేస్తున్నాయి. ఈ రెండు ఎకరాల స్థలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటికి తెచ్చేలా ఒక సమగ్ర భవనాన్ని నిర్మిస్తే, ప్రభుత్వ సొమ్ము ఆదా అవ్వడమే కాకుండా ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందుతాయని ఆమె స్పష్టం చేశారు.

Next Story