- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీసీ కాంట్రాక్టు కార్మికుడు మృతి.. మృతదేహంతో కుటుంబసభ్యుల కన్నీటి పోరాటం
ఐటీసీ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందడంతో ఐటీసీ గేటు ముందు మృతదేహంతో కుటుంబసభ్యుల కన్నీటి పోరాటం చేస్తున్నారు.

దిశ, బూర్గంపాడు: ఆ ఇల్లు నిన్నటి వరకు ఒక చిన్నపాటి సంతోషాల హరివిల్లు. కష్టపడి సంపాదించే ఇలవేల్పు ఉన్నాడనే ధీమా ఆ కుటుంబానిది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబ పెద్ద గుండెపోటుతో అకాల మరణం పాలయ్యాడు. దీంతో ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిమయమైంది. తమకు ఆసరాగా నిలిచే నాథుడు లేక, యాజమాన్యం నుంచి కనీస మానవత్వం కరువై.. సుమారు 15 గంటలుగా మృతదేహంతో ఒక కుటుంబం ఫ్యాక్టరీ గేటు ముందే కన్నీరుమున్నీరవుతోంది. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన నరసింహారావు (36) తన భార్య,ఇద్దరు కుమార్తెలతో కలిసి సారపాకలో నివాసం ఉంటున్నాడు. స్థానిక ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులకు హాజరవుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం కూడా విధులకు హాజరైన ఆయనకు మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతగా అనిపించింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా, ప్రధాన కూడలి సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారుపడిన స్థానికులు వెంటనే ఆయన్ను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. ముప్పై ఆరేళ్ల ప్రాయంలోనే కుటుంబ పెద్ద అకాల మరణం చెందడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు.
15 గంటలుగా కొనసాగుతున్న దీన పోరాటం..
కుటుంబానికి ఆధారం కోల్పోయిన తమకు ఐటీసీ యాజమాన్యం న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు నరసింహారావు మృతదేహంతో ఐటీసీ కాలనీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు, జేఏసీ యూనియన్ నాయకులు తరలివచ్చారు. రాత్రి గడిచి తెల్లవారుతున్నా, సుమారు 15 గంటలుగా మృతదేహంతో కుటుంబసభ్యులు గేటు ముందే ధర్నా చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనీస కనికరం చూపకపోవడం గమనార్హం. కార్మికులను కేవలం లాభాలు తెచ్చే యంత్రాలుగానే చూస్తారా? ప్రాణాలు కోల్పోతే మానవీయ కోణంలో స్పందించరా?" అంటూ మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేతల తీరుపై మృతుని బంధువుల ఆగ్రహం..
యూనియన్ ఎన్నికల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ 'మేమున్నాం.. న్యాయం చేస్తాం' అని ప్రగల్భాలు పలికే స్థానిక నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మృతుని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఒక సాధారణ క్యాజువల్ కార్మికుడు చనిపోతే న్యాయం చేయలేకపోతున్న ఆ 'సంచలన' నాయకులు ఎక్కడ నిద్రిస్తున్నారు?" అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుడి ప్రాణానికి కనీస విలువ ఇవ్వకుండా, న్యాయం చేయడంలో వెనకాడుతున్న అంతర్యమేమిటని బంధువులు నిలదీస్తున్నారు. న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని, మృతదేహంతో ఆందోళన కొనసాగిస్తామని కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు.ఇప్పటికైనా యాజమాన్యం, అధికారులు స్పందించి, అనాథలుగా మారిన ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






