వరంగల్ లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించిన అధికారులు

by Ratna Kumari |

హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం శాయంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెం. 23లో ఉన్న విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని అధికారులు రక్షించారు.

వరంగల్ లో  రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించిన అధికారులు
X
దిశ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం శాయంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెం. 23లో ఉన్న విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని అధికారులు రక్షించారు. ఇరవై ఐదుకోట్ల విలువచేసే ఎకరం ఐదుగుంటల భూమిని కాపాడారు. ప్రభుత్వం కు సంబందించి ఈ సర్వే నెంబర్ లో ఐదు ఎక‌రాల భూమి ఉంది. బండలు, రాళ్లతో కొంత భూమి ఉండగా మిగతాది ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంది. ఈ భూమిలో గతంలో అక్రమ మైనింగ్ నిర్వహించబడటంతో భారీ గుంతలు ఏర్పడి భూమి నిరుపయోగ స్థితికి చేరుకుంది. అనంతరం భద్రకాళి చెరువు పూడిక మట్టిని వినియోగించి ఆ గుంతలను పూడ్చి, ప్రజా ప్రయోజనార్థం ఉపయోగపడే విధంగా భూమిని అభివృద్ధి చేశారు.

కొంతమంది వ్యక్తులు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండా దేవాలయం పేరుతో ఆ విలువైన ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ, జి.డబ్ల్యూ.ఎం.సి డీఆర్ఎఫ్ బృందం, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా రక్షించారు. సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాకు యత్నించడమే కాకుండా, అక్కడ వివాదాస్పద పరిస్థితులు సృష్టించి ప్రజలకు అసౌకర్యం కలిగించిన నేపథ్యంలో, వారి పై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 19న కేసు నమోదు చేశామన్నారు. ఇకముందు ఎవరైనా ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, అన్యాక్రాంత చర్యలు లేదా చట్టవిరుద్ధ నిర్మాణాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని కాజీపేట తహశీల్దార్ రాజు హెచ్చరించారు. ఈ భూమి త్వరలో ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారని తెలిపారు.

Next Story