మొదలైన నామినేషన్ల పర్వం

by velandi.Saikiran |   (  Updated:2025-11-27 21:15:44  IST  )

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి మొదలైంది.

మొదలైన నామినేషన్ల పర్వం
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత నామినేషన్ ఘట్టం మొదలైంది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం అధికారులు నోటిఫికేషన్ ను జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్రులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయిలోనే తమ అనుచరులతో మంతనాలు జరుపుతూ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. చివరి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

నామినేషన్ల స్వీకరణ..

ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ మొదలైంది. మొదటి విడత గ్రామాల్లో రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్లకు కావాల్సిన జాబితాను ప్రకటించడంతో పాటు ఓటరు జాబితాను కూడా పంచాయతీ కార్యాలయంలో ప్రకటించారు. గ్రామ పంచాయతీల వద్ద నామినేషన్లను స్వీకరించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నారు. మొదటి రోజు నామినేషన్ తక్కువగా వచ్చినా నేడు, రేపు ఎక్కువగా దాఖలు కానున్నాయి. మొదటి విడత గ్రామాలన్నింటిలో భారీ ఏర్పాట్లను చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 10.30ల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు.

కేంద్రాల వద్ద బందోబస్తు..

నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి పోలీసుల భారీ బందోబస్తు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులను నియమించారు. నామినేషన్లు తీసుకునే చోట 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ ను అమల్లోకి తెచ్చారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకే అభ్యర్థుల వెంట వచ్చే వారిని అనుమతించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు సహాయకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల తనిఖీలను చేపడుతున్నారు. నగదుపైన, వస్తురవాణాపై నిఘా పెట్టారు. రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టడంతో పాటు పెట్రోలింగ్ ను పెంచారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గ్రామాల్లో మొదలైన సందడి..

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వార్డులు, సర్పంచ్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతుండగా నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఎక్కువ మంది మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే ప్రధాన పార్టీల నేతలు పోటీ చేసేవారిని గుర్తించి నిలబెడుతున్నారు. ఎక్కువ మంది పోటీపడుతున్న చోట చర్చలు జరిపి ఒక్కరే తమ పార్టీ తరపున నిలబడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 22 నెలల తర్వాత రావడంతో ఈ దఫా యువతరం నేతలు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని చోట తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించుతున్నారు.

ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీకి సిద్ధమైతే ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొంత మందికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. కొంత మందికి పార్టీలో అవకాశం కల్పిస్తామని చెప్పి బుజ్జగిస్తున్నారు. మొదటి రోజు తక్కువగానే నామినేషన్లు పడినా నేడు, రేపు ఎక్కువగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో కుల సర్టిఫికెట్లు, గ్రామ పంచాయతీ పన్ను చెల్లింపు, ఆదాయం, కుటుంబ ఆస్తులు వంటి వివరాలను సిద్ధం చేసుకుంటూ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలకు నేడు, రేపు ఎక్కువగా నామినేషన్లు పడే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.

Next Story