- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంకా ఒక్క రోజే ప్రచార సమయం ఉండటంతో అభ్యర్తులు వార్డుల్లో ఇళ్లు ఇళ్లు తిరుగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులు చైర్మన్ పీఠాలపై నజర్ పెట్టారు. రిజర్వేషన్ కు అనుగుణంగా చైర్మన్లుగా ఎంపికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. మెజార్టీకి అవసరం అయిన కౌన్సిలర్లు ను గెలిపించుకునేందుకు భారీ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ మున్సిపల్ చైర్మన్లుగా రిజర్వేషన్ కు అనుగుణంగా తమకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పరకాల, తొర్రూర్, వర్ధన్నపేట జనరల్ కు రిజర్వు కాగా, మర్రిపెడ మహిళా జనరల్ కు రిజర్వు అయ్యింది. ఈ మున్సిపాలిటీల పరిధిలో పోటీ భారీగా ఉంది. తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీమంత్రులు, పార్టీ నేతలను కోరుతున్నారు.జనగామ, భూపాలపల్లి మున్సిపాలిటీలు బీసీ జనరల్ కు రిజర్వు కాగా, ములుగు, నర్సంపేట బీసీ మహిళకు రిజర్వు అయ్యాయి. మహబూబాబాద్ ఎస్టీ జనరల్, కేసముద్రం ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. స్టేషన్ ఘన్ పూర్ , డోర్నకల్ ఎస్సీ జనరల్ గా రిజర్వు చేశారు.
జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా మిగతా అన్ని మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యత వారిపైన పెట్టడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మున్సిపాలిటీలో అన్నీ వారై వ్యవహరించడంతో పాటు వార్డుల వారిగా తిరుగుతూ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. రెండు పార్లమెంట్ పరిధిలో ఇంచార్జి మంత్రులను నియమించడం వల్ల వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాగైనా ఈ దఫా గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కనీసం 90 శాతం మున్సిపాలిటీలో గెలవాలని ఉన్నతస్థాయి పార్టీ నేతలు ఆదేశించడంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.
వాడవాడలో తిరుగుతూ..
కాంగ్రెస్ ధీటుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలలోనే ఉంటే వాడ వాడలు తిరుగుతున్నారు. రెండేళ్ల పరిపాలనను ఎండగడుతూనే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.మొత్తంగా ఈ రెండు పార్టీల నేతలు భారీ ప్రచారాలను నిర్వహిస్తుండగా బీజేపీ,వామపక్ష పార్టీ నేతలు కూడా కొంతమేర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీల పరిధిలో పోటీ చేస్తున్న కొంత మంది కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులు చైర్మన్ పీఠాలు ఇస్తే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని ఎమ్మెల్యేలు, మంత్రులకు విన్నవిస్తున్నారు.
అధికార పార్టీ తరపున గెలవడమే కాదు తమకు చైర్మన్ లుగా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైతే కొన్ని వార్డుల్లో ఖర్చు పెడతామని హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ద్వారా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది సీఎం దృష్టి వరకు తీసుకెళ్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం మొదట గెలవండి గెలిచిన తర్వాతనే పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం ఉంటుందని తెలుపుతున్నారు. సమన్వయంతో గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే చైర్మన్ పీఠాలకు పోటీ పెరగడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. వారు ఏ వైపు మొగ్గుతారో ఈ నెల 11 న తేలనుంది.






