సివిల్ సప్లయ్‌ శాఖలో ఆయన చెప్పిందే వేదం

by Malleboina Mahesh |

సివిల్ సప్లయ్ శాఖలో అధికార పార్టీ నేత అప్రకటిత హవా.. రూ.7500 కోట్ల సీఎంఆర్ బకాయిదారుల కేసుల మాఫీ కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు!

సివిల్ సప్లయ్‌ శాఖలో ఆయన చెప్పిందే వేదం
X

దిశ,తెలంగాణ బ్యూరో : సివిల్ సప్లై శాఖలో అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన కనుసన్నల్లోనే శాఖ కార్యాకలాపాలు జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంటర్నల్ విషయాల్లో సైతం ఆయన జోక్యం పెరిగిపోయిందని, కొన్ని సందర్భాల్లో అధికారిక రివ్యూల్లో కూర్చుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే కీలక నేతల చొరవ ఉండటం వల్ల సదరు లీడరు హవా కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఇప్పుడు అధికార పార్టే..

ఒకప్పుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో కీలక పదవిలో పనిచేసిన లీడరు స్థిరంగా ఒక పార్టీలో ఉండరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి చక్రం తిప్పుతుంటారని టాక్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన లీడరు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అక్కడ ఎంజాయ్ చేసిన లీడర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చిరాగానే సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మిల్లర్ల తరఫున ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేయడం, వారిపై ఉన్న కేసులను మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

కేసులు మాఫీకి మామూళ్లు..

2022–23 సంవత్సరంలో కస్టమ్స్ మిల్లింగ్ కోసం తీసుకున్న సుమారు రూ. 7500 కోట్లు విలువగల 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లు వద్దే ఉంది. ఆ ధాన్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ కార్పొరేషన్‌కు మాత్రం మిల్లర్లు మిల్లింగ్ రైస్ ఇవ్వట్లేదు. అలాగని అంత మొత్తంలో డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ బకాయిలు చెల్లించాల్సిన మిల్లర్లను డిఫాల్టర్‌గా ప్రకటించిపై పీడీ యాక్టులు పెట్టింది. కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడే సదరు లీడరు జోక్యం చేసుకుని కేసులు నమోదైన మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా లాబీయింగ్ చేస్తూ, అందుకు ప్రతిఫలంగా సదరు మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే పీడీ యాక్టులు పెట్టిన మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకోవడం‌లేదని అనుమానం సివిల్ సప్లై శాఖ వర్గాల్లో నెలకొన్నది.

ప్రభుత్వానికి చెడ్డ పేరు..

సదరు లీడరు వ్యవహారతీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. ప్రభుత్వంలో ఓ కీలక నేత అండదండలు ఉండటం వల్లే డిపార్ట్‌మెంట్‌లో ఆ లీడరు హడావుడి కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య రైస్ మిల్లర్ల సమావేశానికి హాజరైన కీలక నేత సదరు లీడరు మిల్లర్ల తరుపున కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తారని ప్రకటించినట్టు తెలుస్తున్నది. దీనితో ఇప్పటికే హంగామా చేస్తున్న లీడర్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని టాక్ మొదలైంది. అయితే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశ్యం ఆ లీడరుకు ఉంటే మిల్లర్ల వద్ద పెండింగ్ లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైసును ఇప్పించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని టాక్ అధికార వర్గాల్లో ఉంది.

Next Story