గృహప్రవేశం వేడుకలో 50 మంది రౌడీ మూకల బీభత్సం.. మహిళలు, పిల్లలపై కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడి

by Malleboina Mahesh |

బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో దారుణం.. గృహప్రవేశం వేడుక జరుగుతున్న ఇంట్లో 50 మంది దుండగుల భీకర దాడి.. బంధువులకు తీవ్ర గాయాలు!

గృహప్రవేశం వేడుకలో 50 మంది రౌడీ మూకల బీభత్సం.. మహిళలు, పిల్లలపై కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తెల్లవారుజామున నూతన గ్రూహప్రవేశం వేడుకలో ఉన్న కుటుంబంపై 50 మంది దుండుగులు కర్రలతో దాడులు చేశారు. ఈ షాకింగ్ సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించుకున్న ఓ ఇంట్లో గృహప్రవేశం (Housewarming) వేడుక జరుగుతుండగా.. ఊహించని విధంగా కొందరు దుండగులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. దాదాపు 40 నుండి 50 మంది రౌడీ మూకలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడి

గృహప్రవేశ వేడుకకు బంధువులు, స్నేహితులు వచ్చి ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో దుండుగుల గుంపు ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడింది. వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులపై కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు రువ్వారు. ఈ భీకర దాడిలో వేడుకకు వచ్చిన బంధువుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా (Critical) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడితో దేవేందర్ నగర్ కాలనీలో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. బాధితుల సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తక్షణమే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలు, భూ వివాదాల (Land Disputes) కారణాల వల్లే ఈ మూకుమ్మడి దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Next Story