బతికుండగానే 'కాగితాలపై' కడతేర్చారు..!

by Jakkula.Mamatha |

అంతా మా ఇష్టం.. చట్టం మాకు చుట్టం అన్నట్లుగా తయారైంది మంథని రెవెన్యూ అధికారుల తీరు.

బతికుండగానే కాగితాలపై కడతేర్చారు..!
X

దిశ,మంథని: అంతా మా ఇష్టం.. చట్టం మాకు చుట్టం అన్నట్లుగా తయారైంది మంథని రెవెన్యూ అధికారుల తీరు. ఏకంగా బతికి ఉన్న వ్యక్తిపై ఉన్న భూమి చనిపోయినట్లుగా వారసత్వంగా భూమిని పట్టా చేసుకున్న భూమి విషయంలో అక్రమ పట్టా చేసిన వ్యవహారం పెద్దపల్లి జిల్లా మంథనిలో వెలుగు చూసింది. దీంతో బాధితుడు అధికారులను నిలదీయడంతో విషయం జిల్లా స్థాయికి చేరి ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తమ భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు బాధితుడితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంథని శివారులోని ఓ సర్వే నెంబర్‌లో 4 ఎకరాల 35 గుంటల భూమి ఉంది.

ఈ భూమికి పట్టా సాధించుకునేందుకు అసలు హక్కుదారుడైన బాధితుడు గత కొద్ది రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పని సులువుగా అవుతుందని ఓ మధ్యవర్తికి డబ్బులు కూడా ముట్టజెప్పినట్లు సమాచారం. కానీ సాంకేతిక కారణాలతో అది ముందుకు సాగలేదు. ఇదే సమయంలో ఆ భూమిపై బాధితుడి వారసుల భూమిని పట్టా చేసుకునేందుకు తప్పుడు పత్రాలతో అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి సదరు వ్యక్తికి పట్టా ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. 'భూ భారతి'లో బాధితుడి పేరు మీద ఉన్న ఆ 4:35 గుంటల భూమిని అతడు మరణించినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించారు. 'విరాసత్' కింద అక్రమంగా పట్టా బదిలీ చేసేశారు. పట్టా అయిన తర్వాత అందులోంచి 4 ఎకరాల 15 గుంటల భూమిని ఇతరులకు విక్రయించడం ఈ స్కామ్ తీవ్రతకు అద్దం పడుతోంది.

అధికారుల భరోసా...గుట్టుగా సస్పెన్షన్లు

తన భూమి అన్యాక్రాంతం కావడంతో పాటు, తాను చనిపోయినట్లు రికార్డులు మార్చారని తెలుసుకున్న బాధితుడు మూడు రోజుల క్రితం మంథని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశాడు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అక్రమానికి పాల్పడిన ఇద్దరు కిందిస్థాయి అధికారులపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ఈ సస్పెన్షన్ల విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు తీవ్ర జాగ్రత్తలు పడ్డారు. పైగా ‘పది రోజులు ఓపిక పట్టు.. నీ భూమి నీకు ఇప్పిస్తాం.. అంతా మేము సెట్ చేస్తాం’ అంటూ బాధితుడికి భరోసా ఇచ్చి అతన్ని ప్రశాంత పరిచే పనిలో పడినట్లు సమాచారం. సస్పెన్షన్ ఎత్తి వేయించుకునేందుకు సదరు అధికారులు ప్రస్తుతం జిల్లా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

బలిపశువులు వాళ్లేనా? పెద్దల పాత్ర ఏది..?

బతికి ఉన్న వ్యక్తిని చంపేసి భూమిని కాజేసిన ఈ ఘటన మంథని ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పై దళిత, ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. అసలు విరాసత్ ఫైల్ పై సంతకాలు చేసిన ఉన్నతాధికారుల పాత్ర ఇందులో లేదా? కేవలం కింది స్థాయి వారే ఇంత పెద్ద స్కామ్ చేయగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

విచారణ చేస్తే మరిన్ని డొంకలు కదిలే ఛాన్స్..!

ఇది కేవలం బయటపడిన ఒక ఉదాహరణ మాత్రమేనని, మంథని రెవెన్యూ కార్యాలయంలో ఇలాంటి అక్రమ పట్టాలు ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే.. భూ భాగోతాలకు సంబంధించిన మరిన్ని అక్రమాలు బట్టబయలయ్యే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. బాధ్యులైన ఉన్నతాధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంథని తహసీల్దార్​వివరణ కోసం చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అయితే ఇదే సర్వే నెంబర్ లో ఎలాంటి పట్టా మార్పిడి జరగకుండా భూ భారతి సైట్ లో బ్లాక్ లో పెట్టారు.

Next Story