- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకులాల్లో కక్కుర్తి.. విద్యార్థుల ఆరోగ్యంతో కాంట్రాక్టర్ల ఆటలు!
తెలంగాణ గురుకులాల్లో కాంట్రాక్టర్ల అక్రమాలు.. బరువు కోసం నానబెట్టిన మాంసం, నీళ్లు కొట్టిన కూరగాయల సరఫరా.. విద్యార్థుల ఆరోగ్యం ఫసక్!

దిశ, తెలంగాణ బ్యూరో : ‘గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు వెళ్లడం ఖాయం. దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయాలతో భోజనం పెడితే ఊరుకునేది లేదు. పిల్లలు కలుషిత ఆహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేయడం కనపడొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే అధికారులను ఆదేశిస్తుంటారు. కానీ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు నాణ్యత లేని సరుకులు పంపిణీ చేస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారని విద్యార్థులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి.. విద్యనందిస్తోంది.
ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుండటంతో.. విద్యార్థులు గురుకులాల్లో భారీగా చేరుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా భారీగా నిధులు కేటాయించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించింది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలాచోట్ల పరిస్థితి దారుణంగా ఉంది. పలు గురుకులాలకు నాణ్యత లేని మాంసం, కూరగాయలు, సరుకులు సరఫరా చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాణ్యత లేనివి సరఫరా
గురుకులాల్లో తక్కువలో తక్కువ నెలకు ఆరుసార్లు విద్యార్థులకు మాంసంతో భోజనం పెట్టాలి. చాలాచోట్ల నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్‌తో భోజనం పెడుతున్నారు. అయితే.. చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. కోళ్ల మెడ భాగం, పక్క బొక్కలను ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. అంతేకాదు.. చికెన్ వెయిట్ ఎక్కువ రావడానికి గంటల పాటు నీటిలో నానపెడుతున్నారు. దీంతో బరువు ఎక్కువ వస్తోంది. ఇక మటన్ విషయంలో కాంట్రాక్టర్లు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముసలి గొర్లు, మేకల మాంసాన్ని తక్కువ ధరకు అమ్మేవారి దగ్గర తీసుకొస్తున్నారు. కొన్నిచోట్ల రెండుమూడు రోజుల కిందటి మటన్‌ను సప్లై చేస్తున్నారు. ఫలితంగా గతేడాది ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేకం వెలుగుచూశాయి.
కాంట్రాక్టర్లు చెప్పిందే లెక్క..
కూరగాయల విషయంలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే వ్యవహరిస్తున్నారు. తాజాగాలేని కూరగాయలను సరఫరా చేస్తున్నారు. వీటిని గురుకులాల్లో తూకం వేయకుండానే లెక్కలు రాసుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంది. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్స్ కుమ్మక్కయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తక్కువ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఏడాదంతా ఎలా ఉంటుందోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లాల్లో ఓ ఉన్నతాధికారి తనిఖీలు చేసినప్పుడు నాణ్యత లేని సరుకులు దర్శనమిచ్చాయి. దీంతో ఆ అధికారి అక్కడి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తరుచూ గురుకులాలను సందర్శించి, నాణ్యత పరిశీలిస్తే.. కాంట్రాక్టర్లకు, ప్రిన్సిపల్స్‌కు భయం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గురుకులాలకు సరుకులు సరఫరా చేయడానికి జిల్లాల స్థాయిలో కలెక్టర్లు టెండర్లను ఆహ్వానిస్తారు. ఎవరు తక్కువ ధరలు కోట్ చేస్తే.. వారికి టెండర్ ఖరారు చేస్తారు. దీంతో కాంట్రాక్టర్లు లాభాల కోసం నాణ్యత లేని సరుకులను గురుకులాలకు సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లు గురుకులాలకు సరుకులు తీసుకొచ్చే సమయంలో టెండర్ ప్రకారం నాణ్యమైనవి సరఫరా చేస్తున్నారా ? లేదా ? అని గురుకులాల ప్రిన్సిపల్స్ పరిశీలించాలి. నాణ్యత లేకపోతే తిరిగి పంపే అధికారం వారికి ఉంటుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కలిపి 1,023కు పైగా గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో 350కి పైగా గురుకులాల్లో ప్రిన్సిపల్స్ లేరు. ఇన్‌చార్జులు ఉన్నా.. సరుకులు, మాంసం, కూరగాయల నాణ్యతను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అనేక చోట్ల ఇంకా కొత్త టెండర్లు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి పాతవారే సరఫరా చేస్తున్నారు.






