నర్సంపేటలో భూముల దోపిడీ: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వైనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-06 02:13:30  IST  )

నర్సంపేట పట్టణంలోని నెక్కొండ వెళ్లే రోడ్డు వైపున గల సర్వే నెంబర్ 601 ప్రభుత్వ అసైన్డ్ భూమి అని రికార్డులు చెబుతున్నాయి. దీని వెనుక ఓనూతన వెంచర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

నర్సంపేటలో భూముల దోపిడీ: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వైనం
X

దిశ, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఆక్రమణదారుల చేతిలోపడి ప్రైవేట్ భూములుగా మారుతుండడం నర్సంపేటలో హాట్ టాపిక్ గా మారింది. భూముల మార్పిడి ప్రక్రియ పూర్తిగా పేపర్ల మీదనే జరుగుతుండటం గమనార్హం. దాదాపు 40ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా ఉన్న స్థలాలు నెల రోజుల క్రితం ప్రైవేట్ భూములుగా మారడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గడచిన ఏడాదిన్నర కాలంలో ఓ భూమిని ప్రభుత్వ భూమిగా భావించిన అధికారులు అక్రమంగా రోడ్డు వేస్తున్నారని ఆరోపిస్తూ మూడు సార్లు ధ్వంసం చేశారు. మళ్లీ రోడ్డు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని నర్సంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి, తహసీల్దార్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. అధికారుల మాటలు ఎప్పటిలాగే ఖాతర్​ చేయని సదరు వ్యక్తులు అదే రాత్రి మోరీల నిర్మాణం సహా రోడ్డు పూర్తి చేశారు. ఇది గడచి నేటికి దాదాపు నెల కావస్తున్నా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు సరికదా కనీసం ఎప్పటిలానే రోడ్డును ధ్వంసం చేసే ప్రయత్నమూ చేయలేదు. పై పెచ్చు అది ప్రభుత్వ భూమి కాదని, అందుకే అధికారులు రోడ్డు ధ్వంసం కోసం చర్యలు చేపట్టడం లేదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.

నెలలోనే ప్రభుత్వ భూమి మాయమైందా..?

నర్సంపేట పట్టణంలోని నెక్కొండ వెళ్లే రోడ్డు వైపున గల సర్వే నెంబర్ 601 ప్రభుత్వ అసైన్డ్ భూమి అని రికార్డులు చెబుతున్నాయి. దీని వెనుక ఓనూతన వెంచర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వెంచర్ కు వెళ్లేందుకు దారి లేకపోవడం, 601 నుంచి సులభంగా వెళ్లేలా ఉండడంతో అప్రోచ్ రోడ్డుగా చూపించేలా రోడ్డు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టారని మున్సిపాలిటీ అధికారులు, ప్రభుత్వ భూమిలో రోడ్డేశారని రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి రోడ్డును ధ్వంసం చేశారు. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ధ్వంసం చేశారు. గత నెల 10వ తేదీన సదరు వ్యక్తులు మళ్లీ రోడ్డు నిర్మాణం, మోరీలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఆ రోజు నుంచి నేటి వరకు ఆ దిక్కుగా వెళ్లలేదు. ఇవాళ రేపు అంటూ తాత్సారం చేసిన అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. మరోపక్క అది ప్రభుత్వ భూమి కాదంటూ పట్టణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వ భూమి ఎలా మాయమైందో అధికారులు చెప్పాలని ప్రశిస్తున్నారు. సెటిల్మెంట్, పలుకుబడితోనే ఇది సాధ్యమైందని మరికొందరు విమర్శిస్తున్నారు.

రెవెన్యూ శాఖకు ముందు తెలియదా..?

నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల వివరాలు రెవెన్యూ కార్యాలయంలో ఉంటాయి. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంలో అక్కడి రోడ్డును మూడు సార్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అది ప్రభుత్వ భూమి కాదా అనేది అధికారులకు తెలియకుండా ఎలా చేశారన్నది పట్టణ ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే నేటికీ చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది తెలియడం లేదు. మరోవైపు సదరు వ్యక్తులు ఇటీవల కొన్ని పేపర్లు తీసుకొచ్చినట్లు అందులో ప్రభుత్వ భూమిగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ భూమి ఇటీవల పేపర్లతో ప్రైవేట్ భూమిగా ఎలా మారిందన్నది ప్రశ్నగా మిగులుతోంది.

జంకుతున్న అధికారులు..!

సర్వే నెంబర్ 601 ప్రభుత్వ అసైన్డ్ భూమి విషయంలో చర్యలకు అధికారులు జంకుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పిన అధికారులు ఆ వైపుగా వెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకుని కంచె చేను మేస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల తీరుపై జనాల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.

Next Story