కన్నుల పండువగా నాగవెల్లి జాతర

by velandi.Saikiran |

వనం నుంచి స్వామి, అమ్మవార్లను గిరిజన సంప్రదాయాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అడవి దారుల్లో భక్తులు పొర్లుదండాలు పెట్టి, నీళ్లు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

కన్నుల పండువగా నాగవెల్లి జాతర
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల అటవీ ప్రాంతం గురువారం భక్తి పరవశంలో మునిగిపోయింది. అడవుల్లో కొలువుతీరిన ఆదివాసీ దేవుడు పగిడిద్దరాజు, సమ్మక్క అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజామునే భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గురువారం ఉదయం ప్రధాన పూజారులు పెనుక బుచ్చి రాములు, సురేందర్, రాజేశ్వర్, పురుషోత్తం, రామస్వామి, రాహుల్ పెనుక వంశీయులు దేవుడి గుట్ట ప్రాంతంలోని వనం వద్దకు చేరుకుని పగిడిద్దరాజు (నాగవెల్లి), సమ్మక్క అమ్మవార్లకు రహస్య పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు.

స్వామి, అమ్మవార్ల ఊరేగింపు..

వనం నుంచి స్వామి, అమ్మవార్లను గిరిజన సంప్రదాయాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అడవి దారుల్లో భక్తులు పొర్లుదండాలు పెట్టి, నీళ్లు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. వనం నుంచి జనం లోకి వచ్చిన స్వామిని దర్శనం భక్తులను పరవశింపజేసింది. అనంతరం పగిడిద్దరాజు నాగవెల్లి జాతరలో అత్యంత కీలక ఘట్టమైన గంగా స్నానం ఘనంగా జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరించారు. మహిళలు వరం పట్టి మొక్కులు చెల్లించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో తాత్కాలిక దుకాణాలు, హోటళ్లు వెలిశాయి. ఎప్పుడూ నిర్మానుష్యంగా కనిపించే అటవీ ప్రాంతం జనసంచారంతో కళకళలాడింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రెండో రోజు జాతర కొనసాగింది. తరలో క్రీడా పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పగిడిద్దరాజు కీర్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో యువతీ, యువకులు పాల్గొన్నారు.

కోరిన కోర్కెలు తీర్చే రాజు..

పూనుగొండ్ల అటవీ ప్రాంతంలో కొలువైన పగిడిద్దరాజుకు ఆదివాసీ సంప్రదాయాలతో జాతరను నిర్వహిస్తున్నాం. స్వామి కొలువైనప్పటి నుంచి ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా స్వామి వారి కుంకుమ పెట్టుకుంటే మస్యలు తీరిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.

–పెనుక రాజేశ్వర్, పగిడిద్దరాజు ప్రధాన పూజారి

మా ప్రాంతంలో కొలువుతీరడం అదృష్టం..

పగిడిద్దరాజు మా ప్రాంతంలో కొలువుతీరడం మా అదృష్టం. కీకారణ్యంలో మారుమూల ప్రాంతంలో పగిడిద్దరాజు కొలువైన పూనుగొండ్ల గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. స్వామి కొలువైన నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా స్వామిని కొలిస్తే పరిష్కారమవుతుంది.

-పెనుక రామస్వామి, పగిడిద్దరాజు ప్రధాన పూజారి

Next Story