మున్సిపల్ పోరు...ఓటరు ముసాయిదా జాబితా విడుదల

by velandi.Saikiran |   (  Updated:2026-01-02 20:30:45  IST  )

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం కసరత్తు చేస్తుండగా ప్రధాన పార్టీల నేతలు పోరుకు సై అంటున్నారు. వరంగల్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో పోరు కోసం ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

మున్సిపల్ పోరు...ఓటరు ముసాయిదా జాబితా విడుదల
X

మున్సిపల్ పోరుకు సన్నద్ధం

=అధికార యంత్రాంగం బిజీబిజీ

=ఓటరు ముసాయిదా జాబితా విడుదల

=పోరుకు సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్ష నేతలు

=మెజార్టీ మున్సిపాలిటీలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల చూపు

దిశ, వరంగల్ బ్యూరో: మున్సిపల్ పోరుపై ప్రధాన పార్టీల నేతలు నజర్ పెట్టారు. ఈ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతుండటంతో నేతలు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మున్సిపల్ రిజర్వేషన్ కు అనుగుణంగా వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలిసి వస్తే చైర్మన్లుగా ఎంపికయ్యేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతలు పోటా పోటీగా మున్సిపల్ పోరు కోసం సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా తమకు పట్టున్న వార్డుల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు.

10న ఓటరు తుది జాబితా విడుదల..

మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను సేకరిస్తూనే ఈ నెల 10న తుది జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో ముందస్తుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మర్రిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీల్లో పాలకవర్గం పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలో ములుగు, కేసముద్రం, స్టేషన్ ఘన్​పూర్ మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 12 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రతీ వార్డు పరిధిలో ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ పరంగా జరుగనుండడంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఓటరు జాబితా ప్రకటనతో పాటు ఎన్నికలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. పార్టీ గుర్తులపైన ఎన్నికలు జరుగనుండటంతో ఈ ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12మున్సిపాలిటీలు..

మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం కసరత్తు చేస్తుండగా ప్రధాన పార్టీల నేతలు పోరుకు సై అంటున్నారు. వరంగల్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో పోరు కోసం ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ నేతలు పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా తమ పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని మున్సిపాలిటీల్లో పోరు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నేతలు సిద్ధమవుతున్నారు. 9 మున్సిపాలిటీలు గతంలోనే ఉండగా కొత్తగా ఏర్పడిన 3 మున్సిపాలిటీలు కలిపి మొత్తం 12 ఇంటిలో గట్టి పోటీ ఇచ్చే విధంగా వార్డులతో పాటు చైర్మన్ పీఠాలను దక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్ధమవుతున్నారు. రిజర్వేషన్ బట్టి పోటికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు పార్టీల నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతుండగా బీజేపీ, వామ పక్ష పార్టీలు కూడా పోటీకి సై అంటున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదలైతే మున్సిపాలిటీల్లో పోరు హోరెత్తనుంది.

Next Story