జాతీయ రహదారి పై రాళ్లు… సురక్షిత ప్రయాణానికి అడ్డుకట్ట

by Bhanu |

నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163పై రోడ్డు మధ్యలో రాళ్ల కుప్పలు వదిలిపెట్టడం ప్రయాణికులకు ప్రమాదాన్ని తప్పించలేని పరిస్థితిగా మారుతోంది.

జాతీయ రహదారి పై రాళ్లు… సురక్షిత ప్రయాణానికి అడ్డుకట్ట
X

దిశ, ములుగు : నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163పై రోడ్డు మధ్యలో రాళ్ల కుప్పలు వదిలిపెట్టడం ప్రయాణికులకు ప్రమాదాన్ని తప్పించలేని పరిస్థితిగా మారుతోంది. మల్లంపల్లి నుండి ములుగు వరకు సాగుతున్న రహదారి విస్తరణ పనులలో భాగంగా, కాంట్రాక్టర్ కల్వర్టుల నిర్మాణం కోసం పదుల సంఖ్యలో రాళ్లను నేరుగా రహదారిపై ఉంచడం, వాటికి ఎలాంటి హెచ్చరిక సూచనలు లేకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఈ రాళ్లకుప్పలు గత వారం రోజులుగా అలాగే ఉండిపోయినా, సంబంధిత అధికారులెవరూ స్పందించకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా, భారీ లోడుతో వేగంగా వెళ్తున్న వాహనాలు ఈ రాళ్లను గమనించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. రోడ్డు పైనే పని సామగ్రిని ఉంచడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని చాటడమే కాక, అధికారుల ఉదాసీనతను కూడా బయటపెడుతోందని వాహనదారులు మండిపడుతున్నారు.

ప్రత్యేకంగా ప్రమాద సూచికలు లేకపోవడం వల్ల, రాత్రి వేళల్లో గమనించకుండా వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఇలాంటి నిర్లక్ష్య కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు గుర్తు చేస్తున్నారు. ప్రయాణికుల సురక్షణను దృష్టిలో ఉంచుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని రాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.





Next Story