కాకతీయ యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చొద్దు: ఎమ్మెల్యే నాయిని

by Kodari Anjali |

యూనివర్సిటీలో మెస్ అక్రమాలపై కమిటీ వేసినా ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే నాయిని అన్నారు.

కాకతీయ యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చొద్దు: ఎమ్మెల్యే నాయిని
X

దిశ, హన్మకొండ టౌన్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి పలుమార్లు సమీక్షలు నిర్వహించి, సమగ్ర డీపీఆర్ రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గత పదేళ్లలో కాకతీయ యూనివర్సిటీ ఏ పరిస్థితికి చేరిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన మార్పులు ఏంటో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు నిష్పక్షపాతంగా విశ్లేషించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దొంగ దీక్షలు, తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందినవారే ఇప్పుడు అభివృద్ధి పేరుతో మళ్లీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై మాత్రమే ఎందుకు వ్యతిరేకత..?

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వివరించేందుకు ప్రయత్నించినా, రెండు మూడు విద్యార్థి సంఘాలు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించాయని విమర్శించారు. యూనివర్సిటీలో సబ్‌స్టేషన్‌కు భూమి ఇచ్చినప్పుడు, బ్యాంకుకు స్థలం కేటాయించినప్పుడు, పోలీస్ స్టేషన్‌కు భూమి ఇచ్చినప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలకు స్థలాలు ఇచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని విద్యార్థి సంఘాలు… యూనివర్సిటీకే ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించారు. యూనివర్సిటీకి సంబంధంలేని వివిధ విభాగాలకు స్థలాలు కేటాయించినప్పుడు ఈ విద్యార్థి సంఘాలు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అప్పట్లో మౌనం పాటించిన వారు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదం పొందిన తర్వాత కూడా అభివృద్ధి పనులను ఎందుకు అడ్డుకున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

కొన్ని విద్యార్థి సంఘాలు..

యూనివర్సిటీలో మెస్ అక్రమాలపై కమిటీ వేసినా ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. మెస్, క్యాంటీన్లలో తరచూ వివాదాలు జరుగుతున్నా స్పందించని వారు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే ఉద్యమాలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని అన్నారు. యూనివర్సిటీకి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులు వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. బోధన, బోధనేతర సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి కీలక అంశాలు కూడా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు, బీజేపీ అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థుల అసలు సమస్యలను పక్కనపెట్టి రాజకీయ అజెండాతో ముందుకు వెళ్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. అన్ని విద్యార్థి సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, కొందరు కావాలనే సహకరించడం లేదన్నారు. కేయూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ భూములు, జీడబ్ల్యూఎంసీ భూముల పేరుతో కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

మామునూరు విమానాశ్రయంపై బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు

మామునూరు విమానాశ్రయం విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా ప్రజలను మోసం చేయడమేనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మామునూరు విమానాశ్రయానికి అవసరమైన కేంద్ర అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు, కార్యాచరణ ఏదీ పూర్తి చేయలేదని అన్నారు. రూ.350 కోట్లకు పైగా జీఎంఆర్‌కు చెల్లింపులు చేసినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విమానాశ్రయ ఏర్పాటుకు స్పష్టమైన పురోగతి సాధించిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టుకు ఇప్పుడు కొత్త ఊపు వచ్చిందని చెప్పారు.పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వారు… ఇప్పుడు విమానాశ్రయంపై తమకే క్రెడిట్ అన్నట్లు మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

సమర్థవంతమైన పాలనా వ్యవస్థ...

నేను తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ బ్రోకర్లు, మధ్యవర్తులు, రాజకీయ స్వార్థం కోసం యూనివర్సిటీని నాశనం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రజల తరఫున నేనే పోరాటం చేస్తాను అని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక ప్రజాప్రతినిధుల కమిటీలు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీకి కూడా అలాంటి వ్యవస్థ ఎందుకు ఉండకూడదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. యూనివర్సిటీలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేసి సమర్థవంతమైన పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేయూ రాజకీయ వేదికగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం మానేసి, యూనివర్సిటీ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story