ఇనుగుర్తిలో భద్రతకు బలం.. భూక్య శోభన్‌బాబు సేవకు ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రశంసలు

by Ramesh Naini |   (  Updated:2025-11-15 14:26:29  IST  )

అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భుక్య శోభన్‌ బాబు స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా రూ. 2.55 లక్షల వ్యయంతో 20 సోలార్ సీసీటీవీ కెమెరాలను మండలంలోని పది కీలక కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.

ఇనుగుర్తిలో భద్రతకు బలం.. భూక్య శోభన్‌బాబు సేవకు ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్‌ బాబు స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా రూ. 2.55 లక్షల వ్యయంతో 20 సోలార్ సీసీటీవీ కెమెరాలను మండలంలోని పది కీలక కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. శనివారం ఈ కెమెరాల ప్రారంభోత్సవానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా గంటా సంజీవ్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్, ఇనుగుర్తి ఎస్‌ఐ తదితర అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శోభన్‌బాబు సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ మాట్లాడుతూ.. ‘నేను కోరితే ఎంతైనా సహాయం చేస్తానని చెప్పినప్పటికీ, ఇలా స్వయంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద సేవ చేయడం చాలా గొప్ప విషయం. శోభన్‌బాబు సేవా గుణం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని ప్రశంసించారు. అలాగే, మండలంలోని భద్రతా పరిరక్షణకు ఈ సీసీ టీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, శాంతి రక్షణలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని, ఈ సేవ మరికొందరికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భూక్య శోభన్‌బాబు మాట్లాడుతూ.. ‘మండల ప్రజల భద్రత కోసం నా వంతు సేవగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాను. భవిష్యత్తులో కూడా ఇనుగుర్తి అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాను’ అని తెలిపారు. కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలా సేవా కార్యక్రమాలను చేపట్టడం గ్రామీణాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. శోభన్‌బాబు చేసిన ఈ పని ఇనుగుర్తి మండలాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చి దిద్దే దిశగా ఒక మంచి ఆరంభం’ అన్నారు.

ఇనుగుర్తి ఎస్‌ఐ మాట్లాడుతూ.. ‘కెమెరాలు సంఘటనలను వెంటనే గుర్తించడంలో, నేరస్థులను అన్వేషించడంలో, గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత మద్దతునందిస్తాయి. పోలీస్ శాఖ తరఫున భూక్య శోభన్‌బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు. ఇక, గ్రామస్తులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, యువత తదితరులు శోభన్‌బాబు అభినందనీయ సేవపై సంతోషం వ్యక్తం చేశారు. కెమెరాల ఏర్పాటు భద్రతను పెంపొందించడంలో ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు.

Next Story