కేటీఆర్‌పై ఫైర్ అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by Bhanu |

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్టేషన్ ఘనపూర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్ అహంకారం, బలుపు పెంచుకుని మాట్లాడుతున్నాడని విమర్శించారు.

కేటీఆర్‌పై ఫైర్ అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
X

దిశ, వరంగల్ బ్యూరో : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్టేషన్ ఘనపూర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్ అహంకారం, బలుపు పెంచుకుని మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ సంద‌ర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గోకుడుగాళ్లను, గికుడుగాళ్లను, తాగుబోతులను వెంటేసుకుని కేటీఆర్ తిరుగుతున్నాడు. బీఆర్‌ఎస్‌లో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నీతి-విలువలు గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. విలువలపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కవిత పార్టీ నుంచి బయటికి రావడం, హరీష్ రావు దూరంగా ఉండటానికి కార‌ణం కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడమే అని అన్నారు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టే హరీష్ రావు ఆగుతున్నాడు అని కేసీఆర్ లేని రోజు బీఆర్‌ఎస్ ముక్కలు చెక్కలు అవుతుంది అని అంచనా వేశారు. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పలేని కేటీఆర్‌కు కుటుంబాన్ని, పెద్దలను విమర్శించే నైతిక హక్కే లేదన్నారు. చెల్లెలికే సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్నాసి కేటీఆర్ అని మండిపడ్డారు.

భారీ స్కామ్‌లలో నిమగ్నమై,..

అలాగే, కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా రాజకీయాలు చేసి, భారీ స్కామ్‌లలో నిమగ్నమై, అక్రమంగా దోచుకున్నాడని ఆరోపించారు. ఇప్పటికే కేటీఆర్‌పై 10 కేసులు ఉన్నాయని, ఎప్పుడైనా జైలుకి వెళ్లే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సంకల్పమని చెప్పారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం తమ ప్రభుత్వం పంపిందని, దానిపై ఒత్తిడి తేవాల్సిన బీఆర్‌ఎస్, బీజేపీలు రాష్ట్రంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని సవాల్ విసిరారు. ఆర్.కృష్ణయ్య బీజేపీ ఎంపీగా కాంగ్రెస్ మోసం చేస్తోంది అనడం తగదని, కేంద్రం చేతిలో ఉన్న నిర్ణయాన్ని తెలిసి కూడా ధర్నాలు చేయడం రాజకీయ నాటకం మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story