స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను : ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి

by Ratna Kumari |

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశానని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబితే ఆ మరుక్షణమే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు

స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను :  ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి
X

దిశ, వరంగల్ బ్యూరో : కేసీఆర్ స్వయంగా తెలంగాణలో రాజకీయ వ్యవస్థను బ్రష్టుపట్టించాను.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశానని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబితే ఆ మరుక్షణమే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్పీకర్ తీర్పు అనంతరం ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మా రాజీనామాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ లు చట్ట బద్దం కావని, అసలు అనర్హత పిటిషన్ కు అర్హత లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియామవళి ప్రకారం పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే ఆ సభ్యునికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అన్నారు. అలా నాకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని తెలిపారు. పార్టీ విప్ ఏనాడూ దిక్కరించలేదని వెల్లడించారు.

కేసీఆర్ ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడలేదని, పార్టీ పరంగా కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. శాసనసభా సమావేశాలలో కేటీఆర్ మా సభ్యుల సంఖ్య 38 అందుకు తగ్గట్లుగా మాకు సమయం ఇవ్వండని స్పీకర్ ను అడిగినట్లు తెలిపారు. మాపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చి బిఆర్ఎస్ ఎల్ పికి నెలకు 5వేల రూపాయలను మా జీతం నుండి సభ్యత్వ రుసుము తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2014 నుండి 2023వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుండి ఎంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపులకు పాత్రదారులు, సూత్రదారులు ఆయానేనని అన్నారు. ఆయన 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ఉండకూడదని శాసనసభా పక్షాలను సైతం పార్టీలో విలీనం చేసుకున్నారని విమర్శించారు. అయినా కేటీఆర్ సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని ఏద్దేవా చేశారు. ఆనాడు మీరు చేసింది తప్పని భావిస్తే.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆరే స్వయంగా నేను చేసింది తప్పు, తెలంగాణలో రాజకీయ వ్యవస్థను బ్రష్టుపట్టించాను అని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అలా చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలా చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చెప్పలేక పొతే మా రాజీనామా ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని స్పష్టం చేశారు.

Next Story