‘పది రోజుల్లో పదేళ్ల అహంకారం కూల్చాం’: మంత్రి వాకిటి శ్రీహరి

by Kodari Anjali |

మున్సిపల్ కుర్చీ లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు..

‘పది రోజుల్లో పదేళ్ల అహంకారం కూల్చాం’: మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, తొర్రూరు: మున్సిపల్ కుర్చీ లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్‌, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా ప్రదర్శించిన అహంకార పాలనను ప్రజలు కేవలం పది రోజుల్లోనే గద్దె దించారని స్పష్టం చేశారు.

ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది..

ఆ విజయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తప్పనిసరి అన్నారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలో కూడా అంతర్గత భేదాలు ఉంటాయని, వాటిని సరిదిద్దుకొని ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. నెలనెలా అప్పుల వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేది..

గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పాలకుర్తికి మినీ స్టేడియం హామీ సమావేశం అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మినీ స్టేడియం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి స్పందనపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

Next Story